SGSTV NEWS online
Andhra PradeshCrime

Kakinada: టీడీపీ కార్యకర్త హత్యోదంతంలో..!॥ మంది వైసీపీ వర్గీయులపై కేసులు

అల్లిపూడిలో కత్తులు, రాళ్లు, బ్లేడులతో రెచ్చిపోయిన ఆ పార్టీ మూకలు  ఏ-1గా వైసీపీ నాయకుడు చినబాబు



తుని, తుని పట్టణం, కోటనందూరు, రౌతులపూడి : కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో శుక్రవారం రాత్రి వైసీపీ శ్రేణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య (38) మృతదేహానికి తుని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం పోస్టుమార్టం జరిగింది. అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 50 మంది వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డట్లు తేలింది. చీకట్లో కత్తులు, రాడ్లు, బ్లేడులు తదితర మారణాయుధాలతో విరుచుకుపడ్డారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. తుని ఆసుపత్రిలో బంగారయ్య మృతిచెందారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చింతకాయల శ్రీరామ్మూర్తి పరిస్థితి విషమంగా ఉంది.

మరో కార్యకర్త దుర్గాప్రసాద్ చికిత్స పొంది ఇంటికి వెళ్లారు. వైసీపీ కు చెందిన ఇద్దరు గాయపడగా వారి చికిత్స అందించారు. వైసీపీ నాయకుడు చింతకాయల చినబాబు ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, అతన్ని ఏ-1గా చేర్చామని తుని గ్రామీణ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. ఇతడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయన్నారు. మరో 10 మంది నిందితులను ఎఫ్ఐ ఆర్ చేర్చామన్నారు. కొందరు పరారీలో ఉండగా గాలిస్తున్నారు. అల్లిపూడిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.



పాతకక్షల నేపథ్యంలో..

పాతకక్షలకు తోడు టీడీపీ శ్రేణులను బలహీనపరచాలని పథకం ప్రకారం వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరంలో ఓ వస్త్ర దుకాణానికి సంబంధించి ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన స్వల్ప వివాదమే హత్యకు దారి తీసిందని చెబుతున్నారు. టీడీపీ శ్రేణులపై దాడి చేయడం, ఓ కార్యకర్తను కిరాతకంగా హత్య చేయడాన్ని తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఖండించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరామ్మూర్తిని ఆమె పరామర్శించారు

Also read

Related posts