November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

కంచే చేను మేసినట్లు.. బ్యాంకు మేనేజరే మోసం..నకిలీ ఎఫ్ డి .. నెలనెలా వడ్డీ



కంచే చేను మేసినట్లు.. బ్యాంకు మేనేజరే మోసం చేస్తే? ఖాతాదారులు ఎవరికి మొరపెట్టుకోవాలి? పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ

అధిక వడ్డీల పేరుతో  పిక్స్డ్ డిపాజిట్లు చేయించిన ఐసీఐసీఐ మేనేజర్

వాటిని సొంత ఖాతాకు మళ్లించుకుని మోసం చిలకలూరిపేట, నరసరావుపేట శాఖల్లో పెరుగుతున్న బాధితులు

నరసరావుపేట,  చిలకలూరిపేట : కంచే చేను మేసినట్లు.. బ్యాంకు మేనేజరే మోసం చేస్తే? ఖాతాదారులు ఎవరికి మొరపెట్టుకోవాలి? పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో అదే జరిగింది. తాము ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది పేరుమోసిన బ్యాంకులో కదా.. పైగా నెలనెలా వడ్డీ కూడా వస్తుంది కదా అని ఖాతాదారులు ధీమాగా ఉన్నారు. రెండు నెలలుగా ఆ వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని. అందులో నగదు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో హతాశులయ్యారు. మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

ఎలా మాయ చేశాడంటే..

ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట శాఖ మేనేజర్ డి. నరేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టాడు. ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి వారితో మమేకమయ్యాడు. అధిక వడ్డీ వస్తుందని నమ్మించి, చాలామందితో బ్యాంకులో నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, బాండ్లు ఇచ్చాడు. ఖాతాదారుల ఫోన్లు ఉపయోగించి బాండ్లపై ఓడీ (ఓవర్గ్రాఫ్ట్) పేరుతో నగదు మొత్తం తన ఖాతాకు జమ చేసుకున్నాడు. కొందరి ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును రెన్యువల్ చేస్తున్నానని చెప్పి, ఓటీపీ చెప్పించుకుని తన ఓడీలోకి మళ్లించుకున్నాడు. 2021లో నరసరావుపేట శాఖకు బదిలీ అయ్యాక అక్కడా ఇలాగే ప్రజల నుంచి పెద్దసంఖ్యలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినట్లు తన ఓడీ ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు నెలనెలా వడ్డీ.. బ్యాంకు నుంచి ఖాతాదారుల ఖాతాలో జమవుతుంది. ఇక్కడ  ఇక్కడ బ్యాంకు నుంచి కాకుండా వేరే ఖాతా నుంచి వడ్డీ జమయ్యేది. నెలనెలా వడ్డీ వస్తుండటం, ఎఫ్ఎ చేయించింది మేనేజరే కావడంతో ఖాతాదారులెవరికీ అనుమానం రాలేదు. నరేష్ గతేడాది నరసరావుపేట నుంచి విజయవాడకు బదిలీ అయ్యాడు.

అధిక వడ్డీ ఆశ చూపి..

బ్యాంకులు వయోవృద్ధులకే 8 శాతం మించి వడ్డీ ఇవ్వవు. నరేష్ అంతకంటే ఎక్కువ వడ్డీ అని చెప్పి ఖాతాదారులను నమ్మించాడు. ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును బ్యాంకుకు కాకుండా ఓడీల ద్వారా సొంత ఖాతాకు మళ్లించుకుని, ఖాతాదారులకు వడ్డీ పేరుతో నెలనెలా రూ.1.10 చొప్పున వేసేవాడు. నూటికి రూపాయికి పైగా వడ్డీ అని చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేలా మాయ చేశాడు. అతనికి గోల్డ్ అప్రైజర్ హరీష్ సహకరించాడు. ఖాతాదారులు లాకర్లో దాచుకున్న బంగారం కూడా మాయం చేశారు. ఇలా చిలకలూరిపేటలోనే సుమారు 90 మంది ఖాతాదారులు ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.1.8 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మోసపోయినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. నరసరావుపేటలోనూ సుమారు 10 మంది ఖాతాదారులు ఇలాగే మోసపోయారు. వారం రోజులుగా ఈ రెండు శాఖల్లో బాధితులను ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. ఈ మోసం విలువ సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే బ్యాంకు సిబ్బంది, ఉన్నతాధికారులు దీనిపై నోరు మెదపడం లేదు. నిందితుడు నరేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గోల్డ్ అప్రైజర్ ఆత్మహత్యాయత్నం చేసి, గుంటూరులో
చికిత్స పొందుతున్నాడు.

ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ మోసాలపై సీఐడీ విచారణ

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ శాఖల్లో జరిగిన మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద బుధవారం బాధితులను పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. గత మేనేజర్ నరేష్ హయాంలో చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ శాఖల్లో అవకతవకలు జరిగాయన్నారు. మూడేళ్ల క్రితమే చిలకలూరిపేట నుంచి నరేష్ బదిలీ అయినా గత నెల 23న ఒక ప్రవాసాంధ్రుడి నుంచి రూ.10 లక్షల డిపాజిట్ తీసుకుని వెళ్లడం విస్మయం కలిగిస్తోందన్నారు. పొలాలు, ఇళ్లు అమ్ముకుని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినవారు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు డబ్బు దాచిపెట్టుకున్నవాళ్లను దారుణంగా మోసగించడం బాధ కలిగిస్తోందన్నారు. అనుమానం రాకుండా మూడేళ్లు మేనేజ్ చేశారంటే  చిలకలూరిపేట బ్రాంచిలోవారు ఇందుకు సహకరించి ఉండొచ్చన్నారు. అనంతరం ఎమ్మెల్యే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో ఫోన్లో మాట్లాడారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందని, మేనేజర్ నరేష్ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు అయ్యన్నార్ ఆయనతో చెప్పారు. గురువారం నుంచి సీఐడీ విచారణ ప్రారంభమవుతుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తెదేపా అండగా ఉండి పోరాటం చేస్తుందని ప్రత్తిపాటి వెల్లడించారు.

Also read

Related posts

Share via