SGSTV NEWS
CrimeNational

ఇంత ఘోరమా.. క్రైమ్ సినిమాలకు మించి మలుపులు!

ట్విస్టులే ట్విస్టులు. క్రైమ్ సినిమాలకు మించిన మలుపులు. జరుగుతుందా నిజజీవితంలోనూ ఇలా కూడా అని ఆశ్చర్యపోయేలా అనిపించే క్రైమ్ స్టోరీ ఒకటి తాజాగా యూపీలో వెలుగులోకి వచ్చింది. తన మైనర్ కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను చంపించేందుకు ఓ తల్లి ప్లాన్ వేసింది. కూతుర్ని చంపడానికి ఓ వ్యక్తికి డబ్బు ముట్టజెప్పింది. ఇంతకీ అతడెవరనేదే ఇక్కడ ట్విస్టు. అంతేకాదు మైనర్ బాలికను చంపడానికి ఆమె తల్లి నుంచి డబ్బు తీసుకుని అతడేం చేశాడనేది మరో ట్విస్టు.

అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లా జశ్రత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 6న ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలిని నయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ నివాసి అయిన అల్కా(35)గా గుర్తించారు. కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ చేపట్టగా విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్కాను చంపిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో చిక్కుముడి వీడింది.

తన 17 ఏళ్ల కూతురు ఎవరితోనో ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న అల్కా సీరియస్ అయింది. ఆమెను ఫారూఖాబాద్ లోని తన పుట్టింటికి పంపించేసింది. అయితే కూతురు వ్యవహారంలో ఎటువంటి మార్పు రాలేదు. ఫోన్ లోనే  ప్రేమికుడితో గంటల తరబడి మాట్లాడుతోందని, ఆమెను తీసుకెళ్లాలని పుట్టింటివారు అల్కాకు గట్టిగా చెప్పారు. దీంతో తన పరువు పోయిందని భావించిన అల్కా కోపంతో రగిలిపోయింది. కూతుర్ని చంపేందుకు సెప్టెంబర్ 27న సుభాష్ సింగ్ (38) అనే వ్యక్తిని కలిసింది. తన కుమార్తెను హతమారిస్తే 50 వేల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసింది. అయితే తన కూతురు ప్రేమించిన వ్యక్తి సుభాషే అని ఆమెకు తెలియకపోవడం ఇక్కడ ట్విస్టు.

అవాక్కైన పోలీసులు

సుభాష్ నేరుగా తన ప్రేయసి దగ్గరకు వెళ్లి జరిగిదంతా చెప్పి మరో ప్లాన్ వేశాడు.అల్కాను అడ్డుతొలగించుకుంటే తాము ఇద్దరు హాయిగా పెళ్లిచేసుకోవచ్చని ప్రియురాలితో చెప్పాడు. ప్రియుడి మాటలు నమ్మిన బాలిక సరే అంది. వీరిద్దరూ కలిసి పథకం ప్రకారం అల్కాను హత్య చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. అల్కాను తామే హత్య చేసినట్టు పోలీసులు ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. పాపం అల్కా.. కూతురిని చంపడానికి ప్రయత్నించి తానే హతమైంది. ఇక ఈ కేసులో ట్విస్టులు చూసి పోలీసులే ఆశ్చర్యపోవడం గమనార్హం.

Also read

Related posts

Share this