November 21, 2024
SGSTV NEWS
CrimeNational

గడ్డం, మీసాలతో కాలేజీకి రావడమే పాపం..!

బెంగళూరులో అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ఓ కాలేజీ విద్యార్థి తన మీసాలు, గడ్డం తీయడానికి నిరాకరించాడన్న కోపంతో అతనిపై సీనియర్లు దాడి చేశారు. ఈ దాడిలో కేరళకు చెందిన ధ్రువ్ (పేరు మార్చాం) అనే వ్యక్తికి దాడిలో చేయి, భుజం విరిగింది. కృపానిధి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌లో ఈ ఘటన జరగగా, నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ధ్రువ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు 30న రాత్రి 8:30 నుంచి 9:00 గంటల మధ్య హడో సిద్దాపురలోని సెయింట్ స్టీఫెన్స్ మార్తోమా చర్చి సమీపంలో ఈ ఘటన జరిగింది. షేవియర్, విష్ణు, శరత్ అనే ముగ్గురు సీనియర్లు, మరో 7-8 మంది విద్యార్థుల బృందంతో కలిసి ధృవ్ షేవింగ్ చేయమని పదే పదే ఒత్తిడి చేశారు. అందుకు ధృవ్ అంగీకరించకపోవడంతో దాడికి తెగబడ్డారు.

ఏప్రిల్‌లో ముగ్గురు సీనియర్లు తన ముఖ వెంట్రుకలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు షేవ్ చేయమని ఒత్తిడి చేయడంతో వేధింపులు మొదలయ్యాయని ధ్రువ్ పేర్కొన్నాడు. క్యాంపస్‌లో అనేకసార్లు ర్యాగింగ్‌కు గురైనప్పటికీ ధ్రువ్ బయటకు చెప్పుకోలేకపోయారు. దాడి జరిగిన సాయంత్రం, శుక్రవారం (ఆగస్టు 30)న చర్చి దగ్గర కలవాలని కోరుతూ సీనియర్‌లలో ఒకరు ధ్రువ్‌కు ఫోన్ చేశారు. ఇబ్బందిని ఊహించి, ధృవ్ తన రూమ్‌మేట్స్‌తో కలిసి వెళ్లాడు, అయితే అక్కడికక్కడే షేవ్ చేసుకోమని మరోసారి హెచ్చరించారు. అందుకు నిరాకరించడంతో, వారు అతనిపై దాడి చేశారు. దీంతో ధృవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి తర్వాత, ధృవ్‌ను అతని స్నేహితులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత విద్యార్థి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. అంతేకాదు బాధితుడి కుటుంబాన్ని నిందితులు ఆసుపత్రిలో బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బెల్లందూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది

తాజా వార్తలు చదవండి

Related posts

Share via