March 12, 2025
SGSTV NEWS
CrimeNational

ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?



వివాహమై చక్కగా సంసారం చేసుకుంటున్న పాత ప్రియురాలి ఇంటికి ఆడవేషంలో వచ్చాడో అపర ప్రేమికుడు. దొంగచాటుగా బాల్కనీ నుంచి వచ్చిన ప్రియడు.. ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తున్న ప్రియురాలి వద్దకు వెళ్లాడు. వెంటనే తనతో వచ్చేయాలని ఆమెను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో..

మధుర, మార్చి 12: పెళ్లైన ప్రియురాలి కోసం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా ఆడ వేషం ధరించి గతంలో తాను ప్రేమించిన పెళ్లైన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అంతటితో ఆగకుండా తనతో వచ్చేయాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే సదరు మహిళ నిరాకరించడంతో వెంటనే తనతోపాటు తీసుకొచ్చిన పెట్రోల్‌ ఆమెపై పోసి, ఆపై నిప్పంటించాడు. మంటల ధాటికి ఆమె అరవడంతో ఇరుగుపొరుగు బయటకు వచ్చారు. దీంతో భయపడిపోయిన ఆడవేషంలోని ప్రియుడు తప్పించుకోవడానికి టెర్రస్‌ పైనుంచి కిందకి దూకేశాడు. తీవ్రంగా గాయపడని అతగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకెళ్తే..


ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే రేఖ (30) వివాహిత భర్త, పిల్లలతో నివసిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. హర్యానాలోని హసన్‌పూర్ గ్రామానికి చెందిన ఉమేష్‌ (28) అనే వ్యక్తి గతంలో పలుమార్లు రేఖ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో వీరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. గత ఏడాది ఆగస్ట్‌ 31న ఉమేష్‌తో కలిసి రేఖ ఇంటి నుంచి వెళ్లిపోగా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో రేఖ ఉన్నట్లు జాడ తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆమెను తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పట్నుంచి రేఖ పాత ప్రియుడు ఉమేష్‌కు దూరంగా ఉండసాగింది.

అయితే మార్చి 11న మధ్యాహ్నం ఉమేష్‌ లెహంగా ధరించి ఆడ వేషంలో ఫ్రెండ్‌ బైక్‌పై రేఖ ఇంటికి వచ్చాడు. ఈ రోజు ఉదయం ఏడు, ఐదేళ్ల వయస్సున్న రేఖ పిల్లలు స్కూల్‌కు, భర్త సంజు కూలి పనులకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా రేఖ టీవీ చూస్తున్న సమయంలో ఉమేష్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. వెంటనే తనతో వచ్చేయాలని ఆమెను బలవంతం చేశాడు. రేఖ నిరాకరించడంతో వెంట తెచ్చిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు టెర్రస్ పైనుంచి కిందకు దూకాడు. మంటలధాటికి రేఖ అరవడంతో ఇరుగుపొరుగు మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెతోపాటు టెర్రస్‌పై నుంచి దూకిన ప్రియుడిని కూడా ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్చారు. 70 శాతానికిపైగా కాలడంతో రేఖ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఉమేష్‌ కూడా తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫరా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్ పాండే తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Also read

Related posts

Share via