March 13, 2025
SGSTV NEWS
CrimeNational

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరోసారి దూకుడు.. మాజీ సీఎం ఇంట్లో సోదాలు..!



ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు కలకలం రేపాయి. మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌, ఆయన కుమారుడు ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) సోదాలు చేయడం పొలిటికల్‌గా హీట్‌ పుట్టించాయి. భూపేష్‌ బఘేల్‌ అనుచరులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతోపాటు ఈడీ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.


ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరోసారి దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌పై ఒక్కసారిగా పంజా విసిరింది. లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలకు సంబంధించి భూపేష్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌పై కొన్నేళ్లుగా మనీలాండరింగ్‌ కేసు నడుస్తోంది. మద్యం కుంభకోణంలో చైతన్య బఘేల్‌కు ముడుపులు ముట్టాయనే ఆరోపణలతో మనీలాండరింగ్‌ కింద ఈడీ కేసు నమోదు చేసింది. దానిలో భాగంగానే.. దుర్గ్‌ జిల్లా భిలాయ్‌ పట్టణంలోని బఘేల్‌ నివాసంలో సడెన్‌గా ఈడీ తనిఖీలు చేపట్టింది. నిన్న ఉదయం ఏడు గంటల నుంచి చైతన్య బఘేల్‌తోపాటు ఆయన అనుచరుల ఇళ్లలోనూ ఈడీ దాడులు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. 2,161 కోట్ల రూపాయల విలువైన లిక్కర్‌ స్కామ్‌లో దర్యాప్తు చేస్తున్నామని.. ఈ స్కామ్‌లో చైతన్య బఘేల్‌ భాగస్వామి అని ఈడీ అధికారులు తెలిపారు.


ఇక.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా భిలాయ్‌ పట్టణంలో తండ్రి భూపేష్‌ బఘేల్‌తో చైతన్య బఘేల్‌ కలిసి ఉంటున్నారు. దాంతో లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి బఘేల్‌ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే.. ఈడీ దాడులపై ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఈడీ తీరును నిరసిస్తూ పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు. భిలాయ్‌లోని భూపేష్‌ బఘేల్‌ నివాసానికి పెద్దఎత్తున చేరుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు తనిఖీలు జరిగినంత సేపు నినాదాలతో హోరెత్తించారు. ఈడీ అధికారులు తనిఖీలు ముగించుకుని వెళ్తుండగా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈడీ అధికారుల వాహనాలపై ఎక్కి నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో.. భారీగా చేరుకున్న పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకుని.. పరిస్థితిని సద్దుమణిచారు.

ఈడీ తీరుపై ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ స్కామ్‌ కేసును సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టేసిందని.. ఓ తప్పుడు కేసును పట్టుకుని ఏడేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ సోదాల్లో సుమారు 33 లక్షల రూపాయలు దొరికాయని.. అయితే.. అవి.. వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులని తెలిపారు. కావాలంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఇస్తామని స్పష్టం చేశారు. లిక్కర్‌ స్కామ్‌ పేరుతో ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఇప్పటివరకు రిపోర్ట్ సమర్పించలేదని, చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంపై భూపేష్‌ బఘేల్‌ మండిపడ్డారు. అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా మారిందన్నారు. పేదల ఇళ్లపై ప్రశ్నలు అడిగిన నాలుగు రోజుల్లోనే ఈడీ తన ఇంటికి వచ్చిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్‌ను అడ్డుకోవచ్చనుకుంటే.. అది బీజేపీ పొరపాటే అవుతుందన్నారు భూపేష్‌ బఘేల్‌. మొత్తంగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు పొలిటికల్‌గా కాక రేపగా.. ఆ సోదాలపై భూపేష్‌ బఘేల్‌ భగభగలాడారు.

Also read

Related posts

Share via