ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడినుంచి విమానాలు, హెలికాప్టర్లు…. ల్యాండింగ్, టేకాఫ్ చేసేందుకు 15 నెలల వ్యవధిలో రెండు సార్లు సక్సెస్‌ఫుల్‌గా ట్రయల్ రన్ నిర్వహించారు. 16వ నంబరు జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్ పాస్ వరకు…. అలాగే బాపట్ల జిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు హైవేపై రన్‌వేలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు రోడ్ కమ్ రన్‌వేలలో తొలుత బాపట్ల జిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు ఉన్న రన్‌వేపై 2022 డిసెంబర్ 28న తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తిచేశారు. ఆ రోజు మొత్తం 5 విమానాలు ఇక్కడ లాండింగ్, పార్కింగ్ చేయడం కోసం తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండగా పరీక్షించారు. ఇక్కడ ల్యాండింగ్ కోసం అన్ని విధాలా అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఈ 5 విమానాల్లో ఒకటి కార్గో విమానం కాగా మరో నాలుగు జెట్ ఫైటర్లు ఉన్నాయి. తొలి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో 15 నెలల తర్వాత తాజాగా రెండో ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈ రెండో ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావడంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
16వ నెంబర్ జాతీయ రహదారిపై బాపట్లజిల్లా కొరిశెపాడు దగ్గర తాజాగా నిర్వహించిన రెండో ట్రయల్ రన్‌లో 8 యుద్ద విమానాలు పాల్గొన్నాయి. మొదట ఈ విమానాల ల్యాండింగ్ కోసం ఓ హెలికాప్టర్ ద్వారా రెండు సార్లు చక్కర్లు కొడుతూ పరిస్థితిని సమీక్షించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో విమానాల ల్యాండింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తొలుత SU-30 పేరుతో పిలిచే 4 సుఖోయ్ యుద్ద విమానాలు హైవేపై తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్ళాయి. ఆ తర్వాత రెండు హక్ యుద్ద విమానాలు ఇంకా అతి తక్కువ ఎత్తులో రోడ్డుకు కేవలం 3 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్ళాయి. ఈ రెండురకాల యుద్ద విమానాలను పూర్తిస్థాయిలో హైవేపై ల్యాండింగ్ చేయలేదు. చివరిగా వచ్చిన రెండు కార్గో విమానాలను మాత్రం రన్‌వేపై ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన తరువాత కొద్దిదూరం రన్‌వేపై ప్రయాణించి తిరిగి యూటర్న్ తీసుకుని వచ్చిన దారినే టేకాఫ్ అయి వెళ్ళిపోయాయి. దీంతో రెండో ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో విజయవంతం అయిందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రాడార్లు, ఇతర ఏవియేషన్ పరికరాలను హైవేపక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు.
16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా కొరిశెపాడు దగ్గర రెండు ప్రాంతాల్లో నిర్దేశిత ప్రాంతం నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర రెండు ఎయిర్ ప్యాడ్లను నిర్మించారు. విమానాల ల్యాండింగ్ కోసం 4 కిలోమీటర్ల మేర రన్‌వేను దృఢంగా, సౌకర్యవంతంగా నిర్మించారు. జాతీయ రహదారిపై 60 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేశారు. వీటిని నిర్మించే ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌తో పాటు రోడ్డు, విద్యుత్ స్తంభాలు, బస్ బే, చెట్లను తొలగించారు. రన్‌వేకు ఆనుకుని ప్రధాన రహదారిపై విమానాల ల్యాండింగ్ కోసం పార్కింగ్ స్లాట్స్ కూడా నిర్మించారు. ఇక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ యుద్ధ విమానాలు ల్యాండింగ్ చేసేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక పూర్తిస్థాయిలో ఈ ఎయిర్ ప్యాడ్లను వినియోగించడమే మిగిలి ఉంది.
Also read
- ఈ రాశుల వారికి జాక్‌పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు