SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: రౌడీషీటర్ల దందా.. కొత్తదారిలో..!




అరెస్టులకు భయపడి సెటిల్మెంట్లు, గూండాయిజానికి దూరం అక్రమ సంపాదనకు జూద శిబిరాలు, డ్రగ్స్ విక్రయాలు పేరు బయటకు రాకుండా అనుచరులతో నిర్వహణ- హైదరాబాద్

అతడో కరడుగట్టిన రౌడీషీటర్. వందకుపైగా పోలీసు కేసులున్నాయి. భూ వివాదాలు, వసూళ్ల దందాతో తరచూ పోలీసు కేసులు, జైలుకు వెళ్లడం తప్పట్లేదని రూటు మార్చాడు. నెలరోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి పాతబస్తీ-శివారు ప్రాంతాల మధ్యలో తన అనుచరులతో పేకాట డెన్ నిర్వహిస్తున్నాడు. రోజూ ఇక్కడ రూ. లక్షల్లో పందేలు సాగుతున్నట్టు సమాచారం. రౌడీషీటర్ నుంచి వివిధ హోదాల్లో పని చేస్తున్న ముగ్గురు పోలీసులకు ముడుపులు అందుతున్నట్టు ఉన్నతాధికారులు ఇటీవల గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం.”

గోల్కొండ, రాయదుర్గం ప్రాంతాల్లోనూ నేరచరిత్ర ఉన్న ఇద్దరు ప్రతివారం ఫామ్ హౌసుల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో హైదరాబాద్, సైబరాబాద్లోని ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.”

మహానగరంలో రౌడీషీటర్లు డబ్బు సంపాదనకు భూ సెటిల్మెంట్లు, హత్యాయత్నాలు, దాడులు, అక్రమ వసూళ్లు వంటి వాటికి పాల్పడుతుంటారు. ఇటీవలకాలంలో వీటిపై పోలీసుల నిఘా తీవ్రతరం కావడంతో రూటు మారుస్తున్నారు. పలు చీకటి కార్యకలాపాలను తమ పేరు బయటకు రాకుండా అనుచరులతో నిర్వహిస్తున్నారు. కొందరు జోరుగా జూదగృహాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు విదేశీ యువతులను తీసుకొచ్చి వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. మాదకద్రవ్యాలు, మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. కొందరు కమీషన్లకు కక్కుర్తిపడే అధికారులు వీరికి అండగా నిలుస్తున్నారు. ఈ ఏడాది 7 నెలల కాలంలో హైదరాబాద్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ అరెస్టయిన నిందితుల్లో సుమారు 10 మంది రౌడీషీటర్లు ఉండటం పరిస్థితికి అద్దంపడుతోంది.

100 మందికి కౌన్సెలింగ్

హైదరాబాద్ లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 3 వేల మంది రౌడీషీటర్లు ఉంటారని అంచనా. వీరిలో అధికశాతం సౌత్, సౌత్రస్ట్, సౌత్వెస్టజోన్, రాజేంద్రనగర్ పరిధిలో ఉన్నారు. కొందరు రాజకీయనేతల పక్కన చేరి భూ వివాదాల్లో తలదూర్చుతున్నారు. అక్రమంగా తుపాకులు సమకూర్చుకుంటున్నారు. వీరి ఆగడాలపై నిఘా పెట్టిన పోలీసులు మొదటి విడతగా 100 మంది రౌడీషీటర్లను పిలిపించి తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై ఎన్హెచ్వైలకు సమాచారం ఉండాలని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రౌడీషీటర్లు డబ్బు సంపాదనకు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు.

👉  ఓర్నీ వేషాలో.. అనాల్సిందే

పహిల్వాన్గా పేరున్న ఒక వ్యక్తిపై బంగారం స్మగ్లింగ్, హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపుల కేసులు లెక్కలేనన్ని ఉన్నాయి. పోలీసులు అతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. జైలు నుంచి బయటకు వచ్చాక తాను మారానంటూ సేవా కార్యక్రమాలు చేపట్టాడు. మళ్లీ కొద్దిరోజులుగా గుట్టుగా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నాడు.


👉  మరో రౌడీషీటర్ అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తనంటూ పోలీసులనే బురిడీ కొట్టిస్తున్నాడు. ఖరీదైన కార్లపై జాతీయ, అంతర్జాతీయస్థాయి సంఘాల ఛైర్మన్, సభ్యుడినంటూ స్టిక్కర్లు పెట్టుకొని హంగామా చేస్తున్నాడు.

👉 సికింద్రాబాద్ పరిధిలో ఒకతను కొంతకాలం గొడవలు, వసూళ్లతో జల్సాలు చేశాడు. కేసులు, కౌన్సెలింగ్కు భయపడి కొద్దిరోజుల క్రితం మైనర్లను కూడదీసి సెల్ఫోన్ చోరీలు చేయించాడు. వరుస దొంగతనాలపై నిఘా పెట్టిన పోలీసులు 100కు పైగా సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని జల్లెడపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా రౌడీషీటర్ పేరు బయటపడింది.

👉 ఫలక్ నామ పరిధిలో ఒకరు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తూ ఇటీవల అరెస్టయ్యాడు.

👌  ఇటీవల చాదర్ ఘాట్కు చెందిన రౌడీషీటర్ మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు.

Also read

Related posts