ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య
పిల్లలను చున్నీతో నడుముకు కట్టుకుని సరస్సులోకి దూకిన తల్లి
వరంగల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సులో ఘటన
ఖానాపురం: ఇద్దరిది ప్రేమ వివాహం..ఆరేళ్లకాపురం..ఇద్దరు ఆడపిల్లలు. ఈ క్రమంలో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం..చివరికి పిల్లలు, భార్యను వదిలి ఆ మహిళతో వెళ్లిపోవడం తట్టుకోలేక పాకాల సరస్సులో కూతుళ్లతో కలిసి తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాలలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన ఈరెల్లి సుమన్, మమత(30)లు ఆరేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. మెడికల్ డిప్లొమా చదివిన మమత నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. సుమన్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
వీరికి ఇద్దరు కూతుళ్లు హరిణి(4) కావ్యశ్రీ(3) జన్మించారు. దాంపత్యం సాఫీగా సాగుతున్న క్రమంలో సుమన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరవై రోజుల క్రితం సుమన్ ఆ మహిళతో ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. దీంతో మమత హైదరాబాద్లో ఉన్న భర్తను తీసుకొచ్చి గీసుగొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మళ్లీ రెండు రోజుల క్రితం సదరు మహిళతో ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. ఈక్రమంలో సదరు మహిళ భర్త, బంధువులు మమత నివాసం ఉండే ఇంటి వద్దకు చేరుకొని భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు తీవ్ర దూషణలకు పాల్పడ్డారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మమత ఇద్దరు పిల్లలతో కలిసి పాకాల చెరువు వద్దకు శనివారం ఉదయం చేరుకుంది. ఎంట్రీ టికెట్ తీసుకుని పార్కులో పిల్లలతో కలిసి కాసేపు గడిపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని హైదరాబాద్లో ఉన్న బంధువులకు వాట్సాప్ ద్వారా లొకేషన్ వివరాలు పంపింది.
తన వెంట తెచ్చిన బ్యాగ్, సెల్ఫోన్ బోటింగ్ పాయింట్ సమీపంలో పెట్టి ఇద్దరు కూతుళ్లను తన చున్నీతో నడుముకు కట్టుకుని సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గుగులోతు రాంమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Also read
- గోకుల్ పార్క్ బీచ్లో విషాదం
- భర్త వివాహేతర సంబంధం తట్టుకోలేక..
- Hyderabad: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
- దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు జపిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందట!
- చ్ఛత్ పూజ 2026 – తేదీలు, ఆచారాలు, పూజ విధి, సామాగ్రి మరియు ధార్మిక ప్రాముఖ్యత





