July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పెళ్లి రోజు చావుకొచ్చింది.. మండీ బిర్యానీ తిని ఎనిమిది మంది కుటుంబసభ్యుల అస్వస్థత

వండుకోవడానికి టైమ్ లేదనో.. రుచికరమైన ఫుడ్ దొరుకుతుందనో బయట రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తిన్నారో.. ఇక అంతే సంగతులు అన్నట్టు తయారైంది పరిస్థితి. పరిశుభ్రతలేని కిచెన్‌లు, కల్తీ పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, కాలం చెల్లిన సరుకులతో తయారీ, ఇదీ ఇప్పుడు హోటల్స్‌లో పరిస్థితి. తాజాగా ఇలాంటి ఘటననే రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లిరోజు కదా అని సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ కుటుంబం ఆసుపత్రి పాలైంది. వెయ్యి రూపాయలు పెట్టి భోజనం చేసి, లక్ష రూపాయల ఆసుపత్రి బిల్లు చెల్లించుకోవల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ మహా నగరం శివారులో జరిగింది.

పెళ్లిరోజు జరుపుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఓ వ్యక్తి హోటల్‌కు వెళ్ళాడు.. గరం గరం బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ఏకంగా కటుుంబం మొత్తం అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది.

షాద్ నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావలి నరేందర్ తన పెళ్లిరోజు ఉందని మే నెల 22వ తేదీన బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులంతా శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

అయితే అప్పటికే నరేందర్‌కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య మంగమ్మ కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరూద్, అభిలాష్, జ్యోష్నా, సాయి, శ్రీకర్ మొత్తం ఎనిమిది మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, పెళ్లి రోజు చావుకొచ్చింది. మండీ బిర్యానీ తిని ఎనిమింది మంది అస్వస్థతకు గురైయ్యారు. హోటల్లో బిర్యానీకి అయ్యింది వెయ్యి.. కానీ ఆసుపత్రి బిల్లు మాత్రం లక్ష రూపాయిలైంది. ఇప్పటికైనా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి హోటల్‌లో పరిశుభ్రత పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Also read

Related posts

Share via