• అడ్డు వచ్చిన మామ పైనా దాడి
• తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు
కొవ్వూరు(కాకినాడ): కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో నరికిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, మామ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహన్ కథనం ప్రకారం.. కొవ్వూరు మండలం వాడపల్లి బంగారుపేటకు చెందిన అడ్డాల నాగయ్య రెండో కుమార్తె కృష్ణతులసి(33)కి, కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడేనికి చెందిన మురళీకృష్ణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది
దంపతుల మధ్య మనస్పర్థలు రావటంతో కృష్ణతులసి కుమారుడు రాముతో కలసి ఆరు నెలల క్రితం బంగారుపేటలోని తండ్రి నాగయ్య వద్దకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ కూడా బంగారుపేటకు వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. నాగయ్యకు అల్లుడు మురళీకృష్ణ కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు అడిగేందుకు కృష్ణతులసి గురువారం సాయంత్రం భర్త మురళీకృష్ణ వద్దకు వెళ్లింది.
తనను డబ్బులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మురళీకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమైపె దాడి చేశాడు. అది గమనించిన నాగయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా మురళీకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కృష్ణతులసి అక్కడికక్కడే మృతి చెందగా, నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మురళీకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కృష్ణతులసి కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.జగన్మోహన్ తెలిపారు.
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు