March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP: ఒంటరి మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్



శ్రీ సత్యసాయి: పోలీసు స్టేషన్ లో ఓ మహిళతో  అసభ్యకరంగా ప్రవర్తించిన మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

జరిగింది ఇది

బంధువుల గొడవపై స్టేషన్కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.

అనంతరం పోలీస్ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్లబోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.

అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వివరించింది.

వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో, ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సీఐ రామయ్యపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి.

Also read

Related posts

Share via