హైదరాబాద్/సుల్తాన్ బజార్: హైదరాబాద్ నడిబొడ్డున శనివారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలో కరడుగట్టిన దొంగ అన్సారీ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. సెల్ ఫోన్ చోరీచేసి అతడు పారి పోతుండగా సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ గమనించి తన గన్మ్యాన్తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు.
ఆత్మరక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ, గన్మ్యాన్లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.

ఘరానా నేరగాడు మహ్మద్ ఒమర్ అన్సారీ…
నగరంలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ అన్సారీపై టప్పాచబుత్ర, కామాటిపుర, మైలార్దేవ్పల్లి, శివరాంపల్లి, చార్మినార్, బహదూర్పుర, అఫ్టల్గంజ్, ఉప్పల్, హుస్సేనిఆలం, ఫలక్నుమా, కాలాపత్తర్ ఠాణాల్లో 20 కేసులు ఉన్నాయి. వీటిలో చైన్ స్నాచింగ్, చోరీ, బెదిరింపులు తదితర నేరాలపై నమోదైనవే అధికం. అతడిపై పోలీసులు గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు.
ఆయా సందర్భాల్లో ఏడాది చొప్పున జైలులో గడిపి వచ్చినా అన్సారీ తన పంథా మార్చుకోలేదు. ఇటీవల మరో నిందితుడితో కలిసి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. రద్దీ ప్రాంతాలతో పాటు నిర్మానుష్యంగా ఉన్న చోటు మాటు వేసి అటుగా వచ్చే వారి సెల్ఫోన్లు లాక్కుపోతున్నాడు. ఇతడితో కలిసి నేరాలు చేస్తున్నది కూడా పాతబస్తీకి చెందిన పాత నేరగాడిగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ పోలీసులకు మోస్ట్వెంటెడ్గా ఉన్నారు.
నేరం చేస్తుండగా గుర్తించి.. 500 మీటర్లు వెంబడించి…
నగరంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్.చైతన్య కుమార్ శనివారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై సైదాబాద్లోని కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం సుల్తాన్బజార్ మీదుగా చాదర్ ఘాట్ చౌరస్తా వైపు వస్తున్నారు. ఈయన వాహనం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ వద్దకు చేరుకునే సమయానికి అన్సారీ, మరో నేరగాడితో కలిసి ఆటోలో వెళ్తున్న వ్యక్తి వద్ద సెల్ఫోన్ దొంగిలించి పారిపోతున్నారు. వారిని గమనించిన చైతన్యకుమార్ తన వాహనం నుంచి కిందకు దిగి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఆయన వెంటే గనామ్యాన్ సైతం వాహనం నుంచి బయటకు వచ్చారు. వారిని తోసేసిన అన్సారీ, మరో నిందితుడు తలోదిక్కు పారిపోయారు. అన్సారీ ఇసామియా బజార్ మీదుగా పారిపోతుండగా డీసీపీ అతడిని ఛేజ్ చేసుకుంటూ విక్టోరియా ప్లే గ్రౌండ్ వరకు దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. ఆయన వెంటనే గన్మ్యాన్ కూడా వచ్చారు. అక్కడ ఓ భవనం ఎక్కిన అన్సారీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్లే గ్రౌండ్స్ లోకి దూకేశాడు.
అతడి వెంటే డీసీపీ, గయ్మ్యాన్ కూడా గ్రౌండ్లోకి దూకారు. అక్కడ తన వద్ద ఉన్న కత్తితో గన్మ్యాన్, డీసీపీపై అన్సారీ దాడికి ప్రయత్నించాడు. పెనుగులాట ముగ్గురూ కిందపడిపోయారు. అదే సమయంతో కత్తితో రెచ్చిపోవడానికి ప్రయత్నించిన అన్సారీపై గన్మ్యాన్ తుపాకీతో డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తూటాలు అన్సారీ చేయి, కడుపులోకి దూసుకుపోయాయి. తీవ్రగాయాలైన అన్సారీ కుప్పకూలిపోయాడు.
ఆస్పత్రుల్లో చికిత్స…
డీసీపీ చైతన్యకుమార్తో పాటు ఆయన గన్మ్యాన్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన అన్సారీని బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్సారీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సుల్తాన్బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సారీతో వచ్చి పరారైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ఉదంతం తర్వాత నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బందిలో అవసరమైన వారికి తుపాకులు జారీ చేయాలని కొత్వాల్ సజ్జనర్ నిర్ణయించారు. కేవలం మహిళలపై జరిగే నేరాల విషయంలోనే కాకుండా ప్రతి నేరగాడి విషయంలోనూ కఠినంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని నేర రహితంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also read
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..
- లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు.. టెక్కీ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలనాలు!
- Andhra: తనను పట్టించుకోని కూతురికి ఊహించిన ఝలక్ ఇచ్చిన వృద్ధురాలు..
- హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం





