SGSTV NEWS online
CrimeTelangana

కూతురును కడతేర్చి… తానూ ఆత్మహత్యాయత్నం



,సంస్థాన్ నారాయణపురం: భార్యాభర్తల మధ్య కలహాలతో  కుమార్తెకు ఎలుకల మందు పెట్టి కడతేర్చాడు ఓ తండ్రి. అనంతరం తానూ నీళ్లలో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవికి నాలుగేళ్ల క్రితం మాడుగులపల్లికి చెందిన స్వాతితో వివాహం జరిగింది.

వీరికి మేఘన(2)తో పాటు 9 నెలల వయసున్న మయూరి అనే కుమార్తె ఉన్నారు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తె మయూరిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మేఘన తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే పెద్ద కుమార్తె మేఘనను కూడా తన దగ్గరికి పంపించాలని స్వాతి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై భార్యాభర్తలు పెద్దమనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాల్సి ఉంది.

కాగా.. తన చిన్న కుమార్తెను తీసుకుని భార్య తల్లిగారింటికి వెళ్లిందనే కోపంతో రవి తన పెద్ద కుమార్తె మేఘనకు మంగళవారం సపోట పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. మేఘన ఆ సపోట పండు తిని వాంతులు చేసుకుంది. అనంతరం రవి కూడా ఎలుకల మందు నీళ్లలో కలుపుకొని తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి మేఘనను హైదరాబాద్కు, రవిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన మృతిచెందింది. రవి పరిస్థితి విషమంగా ఉంది. రవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read

Related posts