April 16, 2025
SGSTV NEWS
Andhra Pradesh

మాజీ సిఎం జగన్‌ తిరుమల దర్శనాన్ని రాద్దాంతం చేస్తున్న కూటమి నేతలు : భూమన

తిరుపతి సిటీ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శ్రీవారి పై అత్యంత భక్తి విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుడిగా వస్తున్నారని, దీనిపై కూటమి నాయకులు రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. పద్మావతిపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ … లడ్డు వివాదం తగ్గుముఖం పట్టడంతో, కొత్తగా జగన్‌ డిక్లరేషన్‌ వివాదాన్ని నెత్తికెత్తుకుంటున్నారని, వాస్తవానికి జగన్‌ అనేకసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారని, ఐదుసార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారని తెలిపారు. బిజెపి నాయకులు తామే హిందువులం అనే విధంగా వారి వైఖరి ఉందని, తాము చెప్పిన వారే హిందువులనేలా వారి తీరు ఉందని, వారి దగ్గర చెప్పించుకునే స్థాయిలో తాము లేమని సూచించారు. పోలీసులు ప్రభుత్వ పెద్దలు తమ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు భయపడబోం అని అన్నారు. ఎవరు ఎన్ని విధాలా అడ్డుకున్నా జగన్మోహన్‌ రెడ్డి శ్రీవారి దర్శనాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకొని, తిరుగు వెళతారని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మేయర్‌ డాక్టర్‌ శిరీష, భూమన అధినాయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via