ప్రాణ భయంతో కన్న కుమారుడ్నే చంపిన తండ్రి – నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బలంగా కొట్టి హత్య – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి డబ్బు కోసం సొంత కుటుంబసభ్యులపైనే దాడికి పాల్పడుతున్న వ్యక్తిని అతని తండ్రి, చిన్నాన్న కలిసి హతమార్చారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన దొడ్డప్పకు కుమారుడు కుపేంద్ర రెడ్డి(30), కుమార్తె ఉన్నారు. వీరిది సామాన్య వ్యవసాయ కుటుంబం. అయితే 8 ఏళ్ల క్రితం దొడ్డప్ప కుటుంబానికి, ఇతరులకు జరిగిన ఘర్షణలో కుపేంద్ర చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కుపేంద్ర ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. గతేడాది జైలు నుంచి వచ్చాక మతిస్థిమితం కోల్పోయి కుటుంబసభ్యులతోనే తరచూ గొడవపడేవాడు.
కర్రతో తలపై బలంగా కొట్టి హత్య : ఈ క్రమంలోనే గురువారం పొలం వద్ద పనులు చేసుకుంటున్న దొడ్డప్ప, చిన్నాన్న దేవరాజ్ వద్దకు వెళ్లిన కుపేంద్ర రెడ్డి వారితో గొడవపడి, దాడికి యత్నించాడు. అలాగే రాత్రి మరోసారి డబ్బు కోసం గొడవకు దిగాడు. కుమారుడి నుంచి తమకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంటుందని భావించిన దొడ్డప్ప, దేవరాజ్లు కుపేంద్రను ఎలాగైనా చంపేయాలని నిశ్చయించుకున్నారు. పథకం ప్రకారం నిద్రిస్తున్న కుపేంద్ర రెడ్డిపై అర్ధరాత్రి దాడి చేశారు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కుపేంద్రరెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనతో నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టినట్టు డి. హీరేహాల్ ఎస్ఐ గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు.
Also read
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!
- AP News: ‘నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా’.. కేటుగాళ్ల కొత్త రకం మోసాలు
- బారువలో నంది విగ్రహం ధ్వంసం
- Rajahmundry:కల్తీ పాలు కేసులో మరో మృతి… మృతుల సంఖ్య 17కి పెరుగుదల.
- మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి





