June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు కూలీలు మృతి




పెదకాకాని (గుంటూరు) : గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు-టాటా ఏస్‌ వాహనాలు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. టాటా ఏస్‌లో 9 మంది కూలీలు ఉదయం విజయవాడ వెళ్లి శుభకార్యం అలంకరణ పనిముగించుకొని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.



పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం …. సిమెంటు, కంకర కలిపే మిల్లర్‌ను ఐషర్‌ వాహనం వెనుక కట్టుకొని గుంటూరు వైపు తీసుకెళుతుంది. పెదకాకాని అమెరికన్‌ ఆంకాలజీ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎదుట ఉన్న జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఐషర్‌ వాహనం మరమ్మతులకు గురై రోడ్డు కుడివైపు ఆగిపోయింది. ఆగి ఉన్న ఐషర్‌ వాహనాన్ని గమనించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు మిల్లర్‌ని బలంగా ఢీకొట్టింది. దీంతో మిల్లర్‌ రోడ్డు మధ్యలోకి జరిగింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏస్‌ మినీ వాహనం మిల్లర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 9మందికి గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టాటా ఏస్‌లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబాబు (40), గుంటూరు నగరానికి చెందిన తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా, పాత గుంటూరుకు చెందిన డి.మధు (25) చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యులు ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలందిస్తున్నారు. కారులోని మరో ముగ్గురు స్వల్పంగా గాయపడటంతో గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్‌, ధూళిపాళ్ల నరేంద్ర, గల్లా మాధవి ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share via