November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

గిరిజనుల భూమిపై వైఎస్సార్సీపీ దందా – ప్రశ్నించినందుకు రెండేళ్లుగా గ్రామ బహిష్కరణ



: ఆధునిక కాలంలో గ్రామ బహిష్కరణలు పూర్తిగా తగ్గాయి. కానీ వైఎస్సార్సీపీ భూదాహం వల్ల అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పెదనూతులులో ఓ మహిళ బహిష్కరణకు గురైంది. గత కొంత కాలంగా తాను సాగు చేసుకుంటున్న భూమిని తప్పుడు పత్రాలతో లాక్కునేందుకు యత్నించారని బాధితురాలు ఆరోపించారు.



ఆ నిరుపేద గిరిజనులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వైఎస్సార్సీపీ నాయకుల అండతో మరో వ్యక్తి పేరుమీద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. వారి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆ గిరిజన కుటుంబాన్ని ఏడాదిన్నరగా పాటు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ సంఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

దేవీపట్నం మండలంలోని చొప్పకొండ పంచాయతీ పెద్దనూతులు గ్రామంలో కొండరెడ్డి కుటుంబానికి చెందిన కామారపు చిన్నమికి 6 ఎకరాల భూమి ఉంది. 1985లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ భూమికి ధ్రువపత్రం హక్కు ఇచ్చింది. ఎన్టీఆర్‌ జీడిమామిడి మొక్కల పథకం (NTR Cashew Plantation Scheme) కింద మొక్కలు కూడా పంపిణీ చేశారు. 39 ఏళ్లుగా ఈ కుటుంబమే ఈ భూమిపై ఆధారపడి జీడిమామిడి తోటలు పెంచుతున్నారు. ప్రతి ఏటా రూ. 1.20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో తన ముగ్గురు పిల్లలతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాలం గడుపుతున్నామని బాధితురాలు చిన్నమ్మి కోడలు కామారపు పండమ్మ తెలిపింది.

రీ సర్వేతో మార్చేశారిలా : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 జనవరిలో చేపట్టిన భూ రీసర్వేలో చిన్నమికి చెందిన 6 ఎకరాల భూమిని చెదల యశోదమ్మ (వాలంటీరు తల్లి) పేరు మీద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ విషయం తమకు భూ సర్వే సమయంలోనే తెలిసిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది తమ భూముల్లో ఉన్న జీడిమామిడి చెట్లు నరికేశారని ఆరోపించారు. ఈ ఘటనపై అప్పట్లో దేవీపట్నం తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు.

గ్రామ బహిష్కరణ : జీడిమామిడి తోటను ఎందుకు నరికేశారని ప్రశ్నించినందుకు తమ కుటుంబాన్ని ఏడాదిన్నరగా వెలివేశారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో ఎవరైనా మాట్లాడితే రూ. 5 వేలు జరిమానా వేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. దీంతో తమతో మాట్లాడేవారే లేరన్నారని వాపోయారు. కనీసం అనారోగ్యంతో ఉండి గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా ఎవరూ ఆటోలు ఎక్కించుకోవడం లేదని తెలిపారు. ఉపాధి హామీ పనులకు సైతం పిలవకుండా తమ కుటుంబాన్ని గ్రామానికి దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read

Related posts

Share via