మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మరికొందరు లొంగిపోయారు. తాజాగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందారు.
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు మెుదలు అయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. అందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతి చెందిన వారిలో హిడ్మా, అతడి భార్య రాజీ అలియాస్ రాజక్క, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు.
భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు నాయకత్వం వహించిన పేరుమోసిన మావోయిస్టు నాయకుడు మడవి హిడ్మా హతమయ్యాడని అధికారులు కూడా ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ట్రై-జంక్షన్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ అనేక మావోయిస్టు స్థావరాలు ఉన్నాయి. ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
హిడ్మా అనేక దాడుల్లో ప్రధాన పాత్ర పోషించారు. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హిడ్మా ప్లానింగ్ చాలా ఉందని అంటారు. దానితోపాటుగా అనేక కీలక దాడుల్లో హిడ్మా ఉన్నారు. హిడ్మా మీద రూ.కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
ఈ ఎన్‌కౌంటర్ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ‘ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నాయకుడు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం భారీ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది.’ అని డీజీపీ అన్నారు.
ఇటీవల లొంగిపోయిన అనేక మంది కీలక మావోయిస్టు నాయకులలో మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, తక్కళపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న ఉన్నారు. మల్లోజుల ఆయుధాలతో సహా లొంగిపోయారు. అయితే ఆశన్న మాత్రం తమది లొంగుబాటు కాదని ప్రకటన చేశారు. జనంలోకి వచ్చి ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. తమతో కలిసి వచ్చేవారు చెప్పాలని ఇరువురు అగ్రనేతలు పిలుపునిచ్చారు. వీరితోపాటుగా వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Also Read
- Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు
- హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!
- మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!
- దిల్లీ పేలుడు : ‘ఆత్మహుతి దాడి’పై సూసైడ్ బాంబర్ సంచలన వీడియో..!
- ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన రాహు, కేతు దేవాలయాలు.. ఇక్కడ పూజ చేస్తే అన్నీ లాభాలే..!





