December 20, 2024
SGSTV NEWS
Telangana

Telangana: అయ్యప్ప మాలలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్

 

అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు ఎంత నియమ నిష్టలతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అయ్యప్ప మాలతో విధులకు హాజరైన ఓ డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించడం భక్తుల ఆగ్రహానికి దారితీసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో ఈ ఘటన వెలుగుచూసింది.



మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో సెక్యూరిటీ సిబ్బంది చేసిన పని ఆందోళనకు దారి తీసింది. అయ్యప్ప మాల ధరించి విధులకు వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు డ్రైవర్లకు నిర్వహించే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో భాగంగా అయ్యప్ప మాల ధరించిన నాగరాజుకు ఆర్టీసీ కానిస్టేబుల్ హేమలత బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు.

అయితే, అయ్యప్ప మాల ధరించి ఉపవాసం ఉండటంతో, తనపై బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయవద్దని నాగరాజు కోరినా.. కానిస్టేబుల్ హేమలత పట్టించుకోకుండా.. టెస్ట్ కంప్లీట్ చేశారు. దీంతో అయప్ప భక్తులు ఆందోళనకు దిగారు. తొర్రూరు ఆర్టీసీ డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలు అయ్యప్ప స్వామి ఆచారాలను అవమానపరిచేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. దీనిపై డిపో మేనేజర్ ప్రవర్తన సైతం సరిగా లేదని భగ్గుమన్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అయ్యప్ప భక్తులను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అయితే ఆర్టీసీ అధికారులు క్షమాపణ చెప్పేదాకా దీక్షను విరమించుకోమని డిమాండ్ చేశారు భక్తులు.

వివాదం మరింత పెద్దదయ్యే అవకాశముందని భావించిన ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి ఘటనపై స్పందించారు. అయ్యప్ప భక్తులకు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో డిపోలోని ఉద్యోగుల ఆచారాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా సిబ్బందికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు

Also read

Related posts

Share via