దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి చెందిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘ఆత్మాహుతి దాడి’పై అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. కాగా పేలుడు సమయంలో కారు నడుపుతున్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. “ఆత్మాహుతి దాడి” అన్న విషయాన్ని “తప్పుగా అర్థం చేసుకున్నారు” అంటూ అతను మాట్లాడుతుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది.
నవంబర్ 10కి ముందే ఈ వీడియోను రికార్డ్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వీడియోలో నబీ ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఆత్మాహుతి దాడుల గురించి చర్చిస్తున్నాడు. ఇటువంటి దాడులకు సాధారణంగా ఉపయోగించే పదమైన ‘ఆత్మహుతి దాడి’ని తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనిపై చాలా విరుద్ధమైన అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చాయని అతను చెప్పడం వినపడింది.
‘ఆత్మాహుతి దాడి’ కాదు.. ‘మార్టిర్‌డమ్ ఆపరేషన్’
క్లిప్‌లో ఉమర్ ఇలా మాట్లాడాడు: “తప్పుగా అర్థం చేసుకున్న భావనల్లో.. ‘ఆత్మాహుతి దాడి’ అని ముద్రవేసిన భావన ఒకటి. ఇది ఒక ‘మార్టిర్‌డమ్ ఆపరేషన్’. దీనికి వ్యతిరేకంగా అనేక వాదనలు, విరుద్ధమైన అభిప్రాయాలు తీసుకొస్తున్నారు.”
“మార్టిర్‌డమ్ ఆపరేషన్ అంటే, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట ప్రదేశంలో, ఒక నిర్దిష్ట సమయంలో తాను తప్పకుండా చనిపోతానని ముందుగానే ఊహించుకుని వెళ్లడం. ఆ వ్యక్తి చనిపోతాడని భావించిన దానికి వ్యతిరేకంగా అతను వెళతాడు. కానీ ఎవరు, ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో చెప్పలేము. జరగాలని రాసిపెట్టి ఉంటే జరుగుతుంది. మరణానికి భయపడకూడదు,” అని నబీ వివరించాడు.
ఈ వీడియో ద్వారా అతను పూర్తిగా రాడికలైజ్ అయ్యాడని స్పష్టమవుతోంది. ఒక హేయమైన పనిని సమర్థిస్తున్న వ్యక్తిగా ఉమర్ ఈ వీడియో కనిపిస్తున్నాడు.
మరో నిందితుడి అరెస్ట్, కుట్ర కోణం..
మరోవైపు దిల్లీ దాడిలో డాక్టర్ ఉమర్కి సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వ్యక్తి జసీర్ బిలాల్ వానీగా గుర్తించారు. ఉమర్ చేత ఇతను ‘బ్రెయిన్‌వాష్’ అయ్యాడని, భారతదేశం అంతటా సమన్వయంతో కూడిన ఆత్మాహుతి దాడుల కోసం ఉమర్‌తో కలిసి పనిచేస్తున్నాడని అంతకుముందు హెచ్‌టీ నివేదించింది.
ఎన్‌ఐఏ దర్యాప్తులో కొత్త విషయాలు
దిల్లీలో పేలుడు జరిగిన కారు యజమాని అయిన కశ్మీరీ ప్లంబర్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటిస్తూ, ఎన్‌ఐఏ మొదటిసారిగా నబీని “సూసైడ్ బాంబర్”గా పేర్కొంది.
పేలిన వాహనాన్ని ఏజెన్సీ “వెహికల్-బోర్న్ ఐఈడీ”గా అభివర్ణించడం కూడా ఇదే తొలిసారి.
ఫోరెన్సిక్ ధృవీకరణ: పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత దర్యాప్తును చేపట్టిన ఎన్‌ఐఏ.. కారు పేలినప్పుడు నబీనే డ్రైవింగ్ చేస్తున్నాడని ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా ధృవీకరించింది.
దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ మాడ్యూల్ విస్తృత కుట్ర కోణాన్ని పరిశీలించడానికి ఒక ప్రత్యేక కేసును నమోదు చేసింది. 2019 పుల్వామా దాడి తరహాలో ఆత్మాహుతి దాడిని అమలు చేయడానికి పేలుడు పదార్థాలు సేకరించారా? వాహనాలను కొనుగోలు చేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Also Read
- Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు
- హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!
- మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి!
- దిల్లీ పేలుడు : ‘ఆత్మహుతి దాడి’పై సూసైడ్ బాంబర్ సంచలన వీడియో..!
- ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన రాహు, కేతు దేవాలయాలు.. ఇక్కడ పూజ చేస్తే అన్నీ లాభాలే..!





