డేటింగ్ యాప్ వాడుతున్నారా…? ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకుండానే చాట్ చేస్తున్నారా? డిన్నర్‌కు బయటికి వెళ్దామని అడుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! సిటీలోకి వచ్చిన కొత్త గ్యాంగ్ ఒకటి మిమ్మల్ని నట్టేట ముంచడానికి సిద్ధమవుతుంది. మీకు తెలియకుండానే మిమ్మల్ని మొగ్గులోకి దింపి నీటుగా మీ పర్సు ఖాళీ చేయాలని ఒక భారీ స్కెచ్ గీశారు. పొరపాటున మీరు ఈ ట్రాప్ లో పడ్డారా ఇక మీ కథ కంచికే..!
ఢిల్లీ నుండి వచ్చిన ఒక ముఠా హైదరాబాద్ లో దిగింది.. వీరు హైదరాబాద్‌కు వచ్చేముందు గూగుల్‌లో వ్యాపారం నష్టాల్లో ఉన్న పబ్బులను ఎంచుకుంటారు. అలా నష్టాల్లో ఉన్న పబ్బులకు లక్షల్లో ఆదాయం తీసుకొస్తామని నమ్మిస్తారు. వీరి డీల్ మొత్తం పబ్ ఓనర్‌తో కాకుండా పబ్ మేనేజర్లతో నడుస్తుంది. పబ్ ఓనర్లు లేని సమయంలో అక్కడ ఉన్న మేనేజర్లే ఇందులో అసలు సూత్రధారులు. డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేస్తున్న
వకులను టార్గెట్ చేస్తుందీ ముఠా. ఈ లోపు ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన అమ్మాయిల ఫోటోలను డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ అప్లోడ్ చేస్తారు. అమ్మాయిలతో కాకుండా నేరుగా వీళ్ళే అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తారు. పరిచయమైన రెండు రోజుల్లోనే డిన్నర్ కి కలుస్తామని ఆఫర్ చేస్తారు. డిన్నర్ కోసం బయటికి వచ్చిన తర్వాత వీరు చెప్పిన అడ్రస్ కి రావాలని మెసేజ్ చేస్తారు. తీరా అక్కడికి వెళ్లేసరికి ఒక పబ్బు దగ్గరికి తీసుకెళ్లి అందులో డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. పబ్బులో ఉన్న మెనూ కాకుండా ప్రత్యేకించి ఈ ముఠా తయారుచేసిన మెనును టార్గెట్ బాధితుడు దగ్గర పెడతారు. అలా బాధితుడు అమ్మాయి పక్కన ఉండటంతో ఇష్టానుసారంగా మద్యం ఆర్డర్ చేస్తాడు. దీన్నే క్యాష్ చేసుకోవాలని చూసింది ఢిల్లీ ముఠా.
ఇలా దర్జాగా దోపిడీకి పాల్పడుతున్న ఢిల్లీ ముఠా గుట్టు హైదరాబాద్‌లో రట్టైంది. పబ్ మేనేజర్ అండదండలతో నెల రోజులపాటు ఇందులో ఈవెంట్ చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. పబ్బులో ఉన్న మెనూ కాకుండా సపరేట్ మెను ఈ నెల రోజుల కోసం తయారుచేస్తారు. నెల రోజుల్లోనే తాము రాబట్టాల్సిన డబ్బు మొత్తాన్ని కస్టమర్ల నుండి రాబట్టేందుకు ప్లాన్ చేశారు. అలా ఏప్రిల్ 17 నుండి మే 31 వరకు దాదాపు 40 లక్షలకు పైగా అక్రమ నగదును కస్టమర్ల నుండి కాజేశారు. ఇందులో నష్టపోయిన బాధితులు సుమారు 50 మందికి పైగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరికి తెలియకుండానే వీరిని ట్రాప్ చేసి, పబ్బు వరకు రప్పించి వారిచేతనే ఎలక్షన్లో బిల్లు కట్టించారు. డ్రింక్స్ ఆర్డర్ చేసిన వెంటనే ఇదే ముఠాలో ఉన్న సభ్యులు వెయిటర్ గా సర్వీస్ బాయ్‌గా, మేనేజర్లుగా అవతారం ఎత్తారు. ఇవేవీ తెలియని బాధితుడు ఒక్కసారిగా బిల్లు చేతిలో పెట్టడంతో అవాక్కయ్యాడు. తన తోపాటు వచ్చిన అమ్మాయి మెల్లగా తనకు మాత్రం ఎక్కువైనట్లు నటించి పబ్బు నుండి జారుకుంటుంది.
- హైదరాబాద్ మోషి పబ్బులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చాలామంది కస్టమర్లు మోసపోయినప్పటికీ బహిరంగంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. కొంతమంది ముందుకు రాకపోయినా గూగుల్ రివ్యూస్‌లో మాత్రం వీరి అసలు భాగోతాన్ని బయటపెట్టారు. పబ్బు ఓనర్లకు తెలియకుండానే పబ్బులో పనిచేసే మేనేజర్ డిల్లీ ముఠా సభ్యులతో చేతులు కలిపి ఈ తరహా క్రైమ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఢిల్లీ ముఠాకు సంబంధించిన వ్యక్తులతో పాటు పబ్ మేనేజర్ కూడా ఉన్నాడు. అయితే తమ ఓనర్ కు తెలియకుండానే మేనేజర్ ఢిల్లీ ముఠాతో చేతులు కలిపి తమను నిండా మించాడని లబోదిబో మంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అటు ఓనర్ పైన కూడా కేసు పెట్టారు.