SGSTV NEWS
CrimeTelangana

Crime: నాతో వచ్చినవారు.. నాతోనే పోతారు!




రెండేళ్ల వయసున్న కవల పిల్లల ఉసురుతీసి తల్లి ఆత్మహత్య బిడ్డల్లో ఒకరికి మాటలు సరిగా రావడం లేదని భర్త వేధింపులు!

హైదరాబాద్- బాలానగర్, : రెండేళ్లయినా కవల పిల్లల్లో ఒకరికి మాటలు రావడం లేదంటూ భర్త వేధిస్తుండటంతో తట్టుకోలేక ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకోవడమే కాదు.. అభంశుభం తెలియని తన ఇద్దరి పిల్లల ఉసురు తీసింది. హైదరాబాద్ బాలానగర్ ఠాణా పరిధి చింతల్లో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలానగర్ ఏసీపీ పింగళి నరేన్రెడ్డి, సీఐ టి. నర్సింహరాజు కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన చెన్ను మారయ్యబాబు దంపతులు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ చింతల్ ప్రసన్ననగర్కు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కుమార్తె సాయిలక్ష్మి(27)కి, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడు నివాసి చల్లారి అనిల్కుమార్(30)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. పద్మారావునగర్ లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు.

చేతన్ కార్తికేయ(2), లాస్యతవల్లి(2) వారి కవల పిల్లలు. కుమార్తెకి మాటలు స్పష్టంగా వస్తుండగా.. కుమారుడికి మాత్రం అంత స్పష్టంగా రావడంలేదు. ఈ విషయంలో భర్త అనిల్ కుమార్ తరచూ గొడవ పడేవాడు. జన్యుపరమైన సమస్యతోనే కొడుక్కి మాటలు రావడంలేదని.. దానికి సాయిలక్ష్మిని బాధ్యురాలిని చేస్తూ మానసికంగా వేధించేవాడు. కుమారుడికి మాటలు బాగా రావాలని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా.. భర్త వేధింపులు ఆగలేదు. సాయిలక్ష్మి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పలుమార్లు అల్లుడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. ప్రయోజనం కనిపించలేదు.

దిండుతో పిల్లల హత్య..

అనిల్ కుమార్ మంగళవారం వైజాగ్ వెళ్లేందుకు.. సోమవారం విధులు ముగిసిన తర్వాత..

మియాపూర్ లోని సోదరుడి ఇంటికెళ్లాడు. రాత్రి భర్త వీడియోకాల్ చేయగా.. సాయిలక్ష్మి మాట్లాడింది. ఆ తర్వాత.. ముందుగా పిల్లల్ని చంపాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులను ఉద్దేశించి.. వీడియో సందేశాన్ని తన ఫోన్లో రికార్డు చేసింది. ‘ఆయన మారడు. అందుకే కష్టమైనా పొరపాటు చేస్తున్నా.. క్షమించండి. నేను లేనప్పుడు.. పిల్లలు ఉండడం అనవసరం. నాతో వచ్చిన వారు.. నాతోనే పోతారు’ అంటూ ఓ వీడియో రికార్డు చేసుకుంది.

మంగళవారం తెల్లవారుజామున పిల్లలు కార్తికేయ, లాస్యతవల్లి నిద్రిస్తుండగా.. దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం తాము ఉండే భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని వీడియోను పరిశీలించారు. సాయిలక్ష్మి తండ్రి మారయ్యబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు మృతురాలి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts