July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

Watch Video: ఓ యువకుడి తప్పిదం.. ఆ ప్రమాదానికి కారణం.. రోడ్డును పడ్డ రెండు కుటుంబాలు..




యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు. ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. ఇది ఓ సినిమాలోని డైలాగ్ అయినా.. ఇదే నిజం. రెండు రోజుల క్రితం రాయదుర్గం పిఎస్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు ఇదే పరిస్థితికి గురయ్యాయి. ఒకరికి కాలులో కొంత భాగాన్ని తీసివేయగా.. మరొకరు వెంటిలేటర్‎పై చికిత్స పొందుతున్నారు. తప్ప తాగి విచక్షణ కోల్పోయి ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కొడారి సత్యనారాయణ, అతని సోదరుడు కాంతారావులు షేక్ పేట దర్గా సమీపంలోని రాధేనగర్‎లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో వాకింగ్ పూర్తి చేసుకున్న ఇద్దరూ.. సమీపంలోని మెహిఫిల్ వద్ద టీ తాగారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. సిగ్నల్ చూసుకుని రోడ్డు దాటుతున్నారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన TS02FH3025నంబరు గల ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న కాంతారావు, వెనుక కూర్చున్న సత్యనారాయణలు ఇద్దరూ గాల్లోకి ఎగిరి కారుపై పడ్డారు. ఘటనలో సత్యనారాయణ కుడికాలు నుజ్జు నుజ్జు అయింది. పక్కటెముకలు విరిగిపోయాయి. కాంతారావు తలకు తీవ్ర గాయం అయింది. వెన్నుముక, లోపలి ఎముకలు, కిడ్నీలు దెబ్బతిన్నాయి. వెంటనే మెహదీపట్నంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ కాలు నుజ్జు నుజ్జు కావడంతో ఇన్ఫక్షన్ సోకకుండా అతని కాలు పాదాన్ని పూర్తిగా తొలగించారు. కానీ తలకు కూడా గాయం కావడంతో ఇంకా కన్నుతెరవలేదు. మరో వైపు కాంతారావు కూడా తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. 48గంటలు గడిస్తే కానీ ఇద్దరి విషయంలో ఎలాంటి సమాచారం చెప్పలేమని వైద్యులు తెలిపారు.

తప్పతాగి యువకులు చేసిన ఈ ప్రమాద దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తొలుత ఓ బైకును ఢీకొనగా.. దానిపై ఉన్న యువతీ, యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కాంతారావు, సత్యనారాయణలు మాత్రం తీవ్రగాయాలపాలయ్యారు. కారు నడుపుతున్న వ్యక్తి నిజాంపేటకు చెందిన కొల్లా సుధీర్ రెడ్డిగా గుర్తించారు. పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. సుధీర్ రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయగా.. 153 రీడింగ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‎కు చెందిన సుధీర్ రెడ్డి.. హైదరాబాద్‎లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన పెదనాన్న కరీంనగర్‎లో హెడ్‌కానిస్టేబుల్‎గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె అమెరికా నుంచి వస్తుండగా.. ఆమెను బుధవారం రాత్రి విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు కరీంనగర్ వెళ్ళిన సుధీర్ రెడ్డి అతని కారును తీసుకొచ్చాడు. మణికొండలోని ఒక రూమ్‎లో స్నేహితులు రవితేజ, రోహిత్ రెడ్డిలతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించిన సుధీర్ కారులో రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టారు. తెల్లవారు జామును ఖాజాగూడలోని లేక్ వ్యూ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మణికొండలోని ఇంటికి బయల్దేరారు. ఇదే క్రమంలో మెహిఫిల్ రెస్టారెంట్ వద్ద రెడ్‌ సిగ్నల్ ఉన్నా ఆగకుండా ఇద్దరిని ఢీకొట్టారు. బాధిత బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ రోజు కూలీగా పచేస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోహిణి ఇంటర్ చదువుతుండగా.. యశ్వంత్ 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రిని ఈ పరిస్థితిలో చూసి చిన్నారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరో వైపు కాంతారావుకు భార్య లేకపోవడంతో ఇద్దరు పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఘటనపై కఠన చర్యలు తీసుకోవాలని.. బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి తమ కుటుంబాల్ని రోడ్డున పడేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts

Share via