SGSTV NEWS online
CrimeTelangana

Crime News: సంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి..

Crime News: సంగారెడ్డి జిల్లా, కొండాపూర్
మండలం మల్కాపూర్లో నివాసముంటున్న సుచిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై మొదట భర్త ఇచ్చిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు నమ్మినా, అంత్యక్రియల సమయంలో మృతదేహంపై కనిపించిన గాయాలు అనుమానాలకు దారి తీశాయి. ఈ ఘటన వెనుక భర్త శ్రీనివాస్ హస్తం ఉండొచ్చని సుచిత బంధువులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సుచిత మరణించిన తర్వాత ఆమె భర్త శ్రీనివాస్, తన భార్య గుండెపోటుతో మరణించిందని బంధువులను నమ్మించాడు. సహజ మరణంగా భావించిన బంధువులు, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో సుచిత మృతదేహాన్ని గమనించిన బంధువులు ఆమె గొంతు వద్ద అనుమానాస్పద మరకలను గుర్తించారు. ఈ మరకలు చూసి వారికి అనుమానం వచ్చింది. దీంతో ఇది సహజ మరణం కాదని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానించారు.

వెంటనే అనుమానం వచ్చిన సుచిత బంధువులు అంత్యక్రియలను నిలిపివేశారు. భర్త శ్రీనివాసే సుచితను హత్య చేసి, అది గుండెపోటుగా చిత్రీకరించడానికి నాటకం ఆడాడని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు కొండాపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు చేపట్టారు.

పోలీసులు అంత్యక్రియలను ఆపేసి, సుచిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణానికి గల కారణాలను నిర్ధారించడం కోసం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా సుచిత మృతికి అసలు కారణం ఏమిటనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనపై కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కారణం భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా లేదా నిజంగానే గుండెపోటా.. అనే కోణంలో ఆలోచిస్తున్నారు.

Also Read

Related posts