ఇంట్లో పెద్దల ముందు పెళ్లికి సరే అన్నాడు.. కానీ 24 గంటలు గడవకముందే మాట మార్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు చివరి నిమిషంలో చెప్పిన ఓ చిన్న సాకు ఓ యువతి నిండు ప్రాణాన్ని బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రేమించేటప్పుడు కనిపించని వయసు తేడా.. పెళ్లి పీటల దాకా వచ్చేసరికి అడ్డంకిగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరి నిమిషంలో తనకంటే వయసు ఎక్కువనే కారణంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామానికి చెందిన కవిత, చరణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న క్రమంలో ఓ రోజు చరణ్ నేరుగా కవిత ఇంటికి వెళ్లాడు. అది గమనించిన కవిత కుటుంబ సభ్యులు వారిద్దరి బంధంపై చరణ్‌ను ప్రశ్నించారు. అప్పుడు అందరి సమక్షంలో కవితను పెళ్లి చేసుకుంటానని చరణ్ మాటిచ్చాడు.
మరుసటి రోజే మాట మార్చిన ప్రియుడు
కుటుంబ సభ్యుల ముందు పెళ్లికి అంగీకరించిన చరణ్, ఆ మరుసటి రోజే ప్లేట్ ఫిరాయించాడు. కవిత వయసు తనకంటే ఎక్కువని, అందుకే ఈ పెళ్లి చేసుకోలేనని తేల్చిచెప్పాడు. చరణ్ కుటుంబ సభ్యులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ పెళ్లికి నిరాకరించారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన వ్యక్తే ఇలా మోసం చేయడంతో పాటు ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తడంతో కవిత తీవ్ర ఆవేదనకు గురైంది. అవమాన భారాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కవిత ప్రాణాలు విడిచింది. చేతికొచ్చిన కూతురు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
నలుగురిపై కేసు.. రిమాండ్‌కు తరలింపు
తమ కుమార్తె మరణానికి చరణ్, అతని కుటుంబ సభ్యుల వేధింపులే కారణమంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చరణ్‌తో పాటు అతని అన్న, తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అనంతరం నలుగురిని రిమాండ్‌కు తరలించారు.
Also read
- వాస్తు పురుషుడు ఎవరు? శివుడి చెమట బిందువు నుంచి జన్మించాడా? ఆసక్తికరమైన పురాణ గాథ ఇదే!
- కార్తీక పురాణం 19వ రోజు
- వైభవ లక్ష్మీ వ్రతం ఎప్పుడు చేస్తారు? వ్రత విధానం, పూజా నియమాలు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వైద్యం వికటించి.. విద్యార్థిని మృత్యువాత





