ఓ నిండు గర్భిణి తన భర్తతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్‌కు చూపించుకుంది. అయితే బయటకు రాగానే ఆమెకు, భర్తకు మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు.. క్షణాల్లో ఆటో ఎక్కేసి వెళ్లిపోయింది. 24 గంటల్లో డెలివరీ ఉంది. ఇప్పటివరకు ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్‌లో కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన నిండు గర్భిణీ అదృశ్యమైపోయింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, కాగజ్ ఘాట్ గ్రామానికి చెందిన స్వప్న(25) నిన్న భర్త శివకుమార్‌తో కలిసి కోఠి మహిళా ప్రసూతి ఆసుపత్రికి చేరుకుంది. అయితే అక్కడ ఆసుపత్రి ఆవరణలో ఏదో విషయంపై దంపతులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు మనస్తాపానికి గురైన స్వప్న ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి ఒక ఆటోలో వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా, ఆమెకి మరో 24 గంటల్లోనే డెలివరీ ఉండడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గర్భిణీ అకస్మాత్తుగా కనిపించకపోవడంతో భర్త శివకుమార్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వప్న కోసం గాలిస్తున్నారు.
పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. స్వప్న ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిన సమయం, ఆమె ఎక్కిన ఆటో దిశ, డ్రైవర్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. అదేవిధంగా, ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబ సభ్యులను, సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఎక్కడికి వెళ్లి ఉండొచ్చన్న అంశంపై అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వప్న కనిపించకుండా పోయిందన్న విషయం తెలిసి బందువులు, గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆసుపత్రి, పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. శివకుమార్‌తో జరిగిన వాగ్వాదం కారణంగా ఆమె మనస్తాపానికి గురై ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు
Also Read
- మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
- నేటి జాతకములు…22 నవంబర్, 2025
- అలసిపోయాను.. చావడానికి అనుమతి ఇవ్వండి.. సుప్రీంకోర్టు, పీఎంవోకు లేఖ!
- Hyderabad: 24 గంటల్లో డెలివరీ.. హాస్పిటల్‌కు వచ్చిన గర్భిణి మిస్సింగ్.. ఇక్కడే అసలు ట్విస్ట్
- హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్టులో ఇరుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!





