SGSTV NEWS online
CrimeTelangana

వికారాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి



వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం చింతకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది..


వికారాబాద్‌, నవంబర్‌ 1: వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం చింతకుంటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ధారూర్‌ సీఐ రఘురామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన భూపతిరెడ్డి పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. ఆయన భార్య వాసవి (33). వీరికి సహర్షరెడ్డి (8), వేదార్షరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల చదువుల కోసం కుటుంబం వికారాబాద్‌లో నివాసం ఉంటోంది.


వారాంతపు సెలవు కావడంతో స్వగ్రామంలో గడిపేందుకు భూపతిరెడ్డి శనివారం భార్యాబిడ్డలను కారులో చింతకుంటకు తీసుకెళ్లారు. వారిని ఇంటి వద్ద దించి ఆయన తాండూరుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న వాసవి, బయట ఆడుకుంటున్న ఇద్దరు కుమారులను లోపలికి పిలిచింది. అనంతరం పడక గదిలో ఇద్దరు పిల్లలకు ఉరివేసి, మరో గదిలో తానూ ఆత్మహత్య చేసుకుంది. వాసవి మామ సాయిరెడ్డి ఈ ఘటనను గుర్తించి భూపతిరెడ్డికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ధారూర్‌ సీఐ రఘురామ్‌, ఎస్సై సురేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు.

వాసవి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు

Also read

Related posts