SGSTV NEWS online
CrimeTelangana

క్యాష్ వ్యాన్‌లో సినిమా ట్విస్ట్.. రూ.17 లక్షలతో డ్రైవర్‌ మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!



హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం సృష్టించిన రూ.17 లక్షల చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఏటీఎంలలో నగదు నింపే ప్రత్యేక గుర్తింపు పొందిన ఉన్న వ్యాన్ డ్రైవర్‌నే భారీ మొత్తాన్ని అపహరించి పారిపోవడం వెనుక పక్కా ఫ్లాన్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దిశగా కేసు నమోదు చేసుకున్న పాతబస్తీ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం సృష్టించిన రూ.17 లక్షల చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఏటీఎంలలో నగదు నింపే ప్రత్యేక గుర్తింపు పొందిన ఉన్న వ్యాన్ డ్రైవర్‌నే భారీ మొత్తాన్ని అపహరించి పారిపోవడం వెనుక పక్కా ఫ్లాన్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దిశగా కేసు నమోదు చేసుకున్న పాతబస్తీ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో జరిగింది. సంతోష్‌నగర్–రెయిన్‌బజార్ ప్రధాన రహదారిపై ఆగి ఉన్న వ్యాన్ నుంచి నగదు మాయం కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, ప్రైవేట్ ఏటీఎం క్యాష్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన వ్యాన్ నగరంలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సంతోష్ నగర్ వాటర్ ట్యాంక్ ప్రాంతానికి రాగానే వ్యాన్‌ ఒక్కసారిగా ఆగిపోయింది. ట్రంక్ బాక్స్ ఉండాల్సిన రూ.17 లక్షలు, వ్యాన్ డ్రైవర్ కనిపించకుండాపోయారు. అయితే ముందుగానే సిద్ధం చేసిన ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చిన వ్యాన్ డ్రైవర్, డబ్బుతో సహా ఓ ద్విచక్ర వాహనంపై ఎక్కి పరారైనట్లు పోలీసులు గుర్తించారు



ఈ ఘటనలో అత్యంత కీలకంగా మారిన అంశం ఏమిటంటే.. డ్రైవర్ పరారైన సమయం, అతడిని తీసుకెళ్లిన బైక్ ఇప్పటికే అక్కడికి చేరుకోవడం. దీంతో ఇది ఆకస్మికంగా జరిగిన చోరీ కాదని, ముందుగానే పక్కా ప్రణాళికతో అమలు చేసిన ఆపరేషన్ కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ ఒక్కడే ఈ దొంగతనానికి పాల్పడ్డాడా? లేక అతడి వెనుక మరికొందరి సహకారం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం ఏటీఎం నగదు నిర్వహణ సంస్థ ప్రతినిధులు ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. డ్రైవర్ కదలికలు, అతడిని తీసుకెళ్లిన బైక్ మార్గం, ఘటనకు ముందు, తర్వాత జరిగిన ఫోన్ కాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.


పోలీసుల విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నగదు తరలింపు విధానం, భద్రతా వ్యవస్థ, నగదు ఉన్న ట్రంక్ బాక్స్‌కు డ్రైవర్‌కు ఎంతవరకు యాక్సెస్ ఉండేది అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. సంస్థలోని అంతర్గత సమాచారంతోనే ఈ చోరీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తులను గుర్తించేందుకు చార్మినార్ జోన్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కేసు పాతబస్తీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగదు భద్రత బాధ్యత ఉన్న వ్యక్తే భారీ మొత్తంతో పరారవ్వడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ చోరీ వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? డ్రైవర్‌ను ఎవరైనా ప్రేరేపించారా? లేక మొత్తం ప్లాన్ అతడిదేనా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది..

Also read

Related posts