హైదరాబాద్‌లో మత్తుపదార్థాల సరఫరా ముఠాపై మల్కాజిగిరి పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎస్ఓటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హషీష్ ఆయిల్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఈ కేసు వివరాలను వెల్లడించారు. చింతల్‌కుంట–వనస్థలిపురం ప్రాంతంలో హషీష్ ఆయిల్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద భారీ మొత్తంలో హషీష్ ఆయిల్ బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు అత్యంత విచిత్రమైన పద్ధతిలో డ్రగ్స్‌ను తరలిస్తున్నారు. హషీష్ ఆయిల్ ప్యాకెట్లను కాళ్లు, పొట్టకు కట్టుకుని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరు సుమారు మూడు కిలోల చొప్పున హషీష్ ఆయిల్‌ను తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 12 కిలోల హషీష్ ఆయిల్‌తో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిరుద్యోగ గిరిజన యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. 12 కిలోల హషీష్ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు క్యారియర్లతో సుమారు రూ.10 లక్షల ఒప్పందం కుదిరినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారు కృష్ణ, బెంగళూరులో డ్రగ్స్‌ను స్వీకరించే సిజో కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో మరెంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
డ్రగ్స్ మాఫియాను మూలాల వరకు వెళ్లి ఛేదిస్తామని సీపీ బి. సుమతి స్పష్టం చేశారు. మత్తుపదార్థాల దందాతో యువత జీవితాలను నాశనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని.. ఎక్కడ ఉన్నా గుర్తించి, ఎంత దూరంలో ఉన్నా వెంటాడుతామని స్పష్టం చేశారు. మత్తు వ్యాపారుల విషయంలో రాజీకి తావులేదని సీపీ పేర్కొన్నారు. మత్తు మాఫియా ఎంత బలమైనదైనా చట్టం కంటే బలమైనది కాదన్నారు. మత్తురహిత సమాజమే మల్కాజిగిరి పోలీసుల లక్ష్యమని తెలిపారు. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also read
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
- శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!





