బీటెక్ మొదటి ఏడాదిలోనే చదువు ఆపేసిన ఓ యువతి బురఖా ధరించి, హ్యాండ్ కట్టర్ మిషన్‌తో ఇళ్ల తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతోంది. ఏడాదిలో ఐదు చోరీలు చేసిన ఆమెను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతోపాటు ఐఫోన్ 17ను స్వాధీనం చేసుకున్నారు..
హైదరాబాద్, నవంబర్ 1: బీటెక్ మొదటి ఏడాదిలోనే చదువు ఆపేసిన ఓ యువతి దొంగతనాల బాట పట్టింది. బురఖా ధరించి, హ్యాండ్ కట్టర్ మిషన్ సాయంతో ఇళ్ల తాళాలు తొలగించి విలువైన వస్తువులను అపహరిస్తోంది. ఇలా వరుస చోరీలకు పాల్పడుతున్న యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి శనివారం మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
తాళం వేసిన ఇంటినే టార్గెట్ చేసి..
ఉప్పల్‌లోని న్యూభరత్‌నగర్‌కు చెందిన గంగం భాస్కర్‌రెడ్డి అక్టోబరు 26న ఇంటికి తాళం వేసి కొమురవెల్లికి వెళ్లారు. ఇదే ప్రాంతానికి చెందిన పాగ జయ (25) ఆ ఇంటిని లక్ష్యంగా చేసుకుంది. అదే రాత్రి ఇంటి తాళం తొలగించి లోపలికి ప్రవేశించింది. అనంతరం 48 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.2 లక్షల నగదును అపహరించి అక్కడి నుంచి పరారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని హమాలీకాలనీకి చెందిన జయ ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీటెక్ మొదటి సంవత్సరం చదువును మధ్యలోనే నిలిపివేసింది. 2023లో హైదరాబాద్‌కు వచ్చి శివకుమార్‌ను వివాహం చేసుకుంది. అనంతరం బురఖా, హ్యాండ్ కట్టర్ మిషన్‌తో ఇళ్లలో చోరీలకు పాల్పడటం ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం టూ టౌన్, జగద్గిరిగుట్ట, మేడిపల్లి, ఉప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
వరుస చోరీలపై దర్యాప్తు చేపట్టిన ఉప్పల్ పోలీసులు ఎట్టకేలకు జయను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదుతోపాటు ఐఫోన్ 17ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ కహానీ!
- మహిళలే టార్గెట్.. బంగారం మాయమైన ప్రతిసారీ ఒకే స్టైల్.. అసలు గుట్టు బయటపెట్టిన సీసీటీవీ!
- ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్ ఆస్పత్రిలో ఏం జరిగింది?
- Hyderabad: సెక్యూరిటీ ముసుగులో గంజాయి సరఫరా.. విద్యార్థులే టార్గెట్..
- Hyderabad: కేసులో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం కాజేసిన కానిస్టేబుల్..





