SGSTV NEWS online
Crime

చంపుతా.. అంటూ నిత్యం బెదిరిస్తుంటే.. ఫూటుగా మద్యం తాగించి చంపేశారు!



అడిగినప్పుడు డబ్బులివ్వకుంటే చంపుతానని నిత్యం బెదిరిస్తున్న ఓ యువకుడిని తోటి స్నేహితులే దారుణంగా హత మార్చారు. ఈ సంఘటన హైదారబాద్‌లోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన కథనం ప్రకారం..


హైదరాబాద్‌, ఏప్రిల్ 7: రంగారెడ్డి జిల్లా యషాహిన్‌నగర్‌ వాదే సాల్హె హీన్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ సలీం కుమారుడు మహ్మద్‌ నసీర్‌ (22) వృత్తి రిత్యా ఎలక్ట్రీషియన్‌. నసీర్‌ నిత్యం కత్తి పట్టుకుని తిరుగుతూ తనకు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానంటూ స్థానికులతో గొడవ పడేవాడు. నిత్యం ఇలా బెదిరింపులకు దిగుతుండటంతో ఆదివారం రాత్రి నసీర్‌ స్నేహితులు మహ్మద్‌ దస్తగిర్‌, మహ్మద్‌ సుబాన్‌ద్దీన్‌ ఇంటికి వచ్చి దావత్‌ చేసుకుందామంటూ బయటికి తీసుకెళ్లారు.


స్థానికంగా ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం సేవించారు. వీరితోపాటు మరో ఇద్దరు స్నేహితులు మొహ్మద్‌ ఇలియాస్, నదీమ్‌ఖాన్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. ఐదుగురు అతిగా మధ్యం సేవించారు. అనంతరం మమ్మల్నే చంపుతానని బెదిరిస్తావా.. మా వద్ద డబ్బు వసూలు చేస్తావా.. అంటూ నసీర్‌పై కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా అతడిని పొడవడంతో తీవ్ర రక్తస్రావమై నసీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు నలుగురు పరారరయ్యారు. అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో నసీర్‌ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన ఓ యువకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా నసీర్‌ మెడ, ఛాతి భాగాల్లో కత్తిపోట్లు కనిపించాయి. అలాగే అతడి తలపై సిమెంట్‌ ఇటుకతో మోదినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. శాంపిళ్లు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతుడి మేనమామ మహ్మద్‌ ఆరీఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మహ్మద్‌ దస్తగిర్‌, మహ్మద్‌ సుబానుద్దీన్‌, మహ్మద్‌ ఇలియాస్‌, మహ్మద్‌ నదీం ఖాన్‌గా గుర్తించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.

Also read

Related posts