SGSTV NEWS online
CrimeTelangana

Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…



తమకు దైవ శక్తి ఉందంటూ పూజలు, పునస్కారాలు చేస్తామంటారు. నమ్మారో నట్టేట ముంచేస్తారు. గాలి సోకిందంటూ తాయత్తులు కట్టి మాయ మాటలు చెప్తారు. సీన్ కట్ చేస్తే అందినకాడికి దోచుకొని నకిలీ బంగారు నాణేలు అంటగట్టి ఎస్కేప్ అవుతారు. ఏంటి ఈ మాయల మరాఠి కథలు అనుకుంటున్నారు. అయితే పూర్తి కథనం చదవాల్సిందే….


చూడ్డానికి ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు కానీ ఈ మహిళలు మహా ముదుర్లు. కాదు కాదు మాయల ముదుర్లు. గుప్తనిధులు, క్షుద్రపూజల పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమాయక ప్రజలను మోసం చేస్తుంటారు. ఇంటి భూగర్భంలో బంగారం ఉందని చెప్పి వెలికి తీయాలంటే లక్షలు ఖర్చు అవుతుందని నమ్మిస్తారు. తీరా రెండు మూడు సార్లు ఇంట్లో ఏవేవో పూజలు చేసి కొన్నాళ్లు సాగదీస్తారు. మరీ ఒత్తిడి పెంచితే నకిలీ బంగారు నాణేలు అంటగడతారు. ఆ తర్వాత ఏమి ఎరగనట్టు సైలెంట్ అయిపోతారు ఈ కిలాడీలు.

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కోట్ల అలివేలు భర్తతో కలిసి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేది. మూడేళ్ల క్రితం స్వగ్రామం నుంచి నాగర్ కర్నూల్ పట్టణంలోని అయ్యప్పనగర్ కాలనీకి షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో తనకు దైవశక్తి ఉందని, తాను దేవుని అవతారం… పూనకం వస్తుందని అందరినీ నమ్మించింది. దీంతో అనారోగ్య, కుటుంబ సమస్యలు ఉన్నవారు అలివేలును ఆశ్రయించడం మొదలు పెట్టారు. ఏవేవో పూజలు చేసి, తాయత్తులు కడుతూ జీవనం సాగిస్తోంది. వికారాబాద్‌కు చెందిన అతెల్లి అనిత సైతం ఏదో సమస్యతో అలీవేలు వద్దకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో గుప్త నిధులు, పూజల పేరుతో అమాయక ప్రజలను మోసం చేయాలని అలివేలు, అనిత ఇద్దరు డిసైడయ్యారు. ఇక తన వద్దకు వచ్చిన వారికి ఇళ్లు, పొలాల్లో బంగారు నిధులు ఉన్నాయని వాటిని బయటకు తీస్తేనే మీ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని చాలా మందిని నమ్మించారు.

ఆరు నెలల క్రితం బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన శ్రీరాంసాగర్ అనే వ్యక్తి కూతురి అనారోగ్య సమస్యకై ఈ ఇద్దరు మహిళలను ఆశ్రయించాడు. పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు చెప్పుకున్నాడు. ఈ క్రమంలో డబ్బు అవసరం ఉందని చెప్పి శ్రీరాం సాగర్‌ వద్ద నాలుగు లక్షలు తీసుకున్నారు. మాసాలు గడుస్తున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అయితే శ్రీరాంసాగర్ ఇంటి భూగర్భంలో నిధులు ఉన్నాయని… అవి వెలికితీస్తేనే మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని నమ్మించారు. ఎలాగు నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంది కావున నీకు ఉచితంగా పూజలు చేసి… నిధులు వెలికి తీస్తామని చెప్పారు.

గుప్త నిధుల కోసం 2, 3 సార్లు ఇంట్లో పూజలు:

ఇక అలివేలు, అనితల మాటలు నమ్మిన శ్రీరాంసాగర్ ఇచ్చిన డబ్బులు అడగడలేదు. నిధులను వెలికితీస్తామని చెప్పి రెండు, మూడు సార్లు పూజలు నిర్వహించారు. ఇక రోజులు గడుస్తున్నా భూగర్భ నిధులు లేవు, ఇచ్చిన డబ్బు రాలేదు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అలివేలు ఇంటికి వెళ్లాడు శ్రీరాంసాగర్. అక్కడికి వెళ్లగానే ఆయనకు షాక్ తగిలే సీన్ కనిపించింది. శ్రీపురం గ్రామానికి చెందిన నిరంజన్ అనే వ్యక్తి అలివేలుతో గొడవ పడుతున్నాడు. తన దగ్గర తీసుకున్న రూ.2.50లక్షలు ఇవ్వకుండా మోసం చేశారని అలివేలును నిరంజన్ నిలదీశాడు. ఇక విషయం తెలుసుకున్న శ్రీరాంసాగర్ తాను సైతం నిరంజన్ మాదిరి మోసపోయానని గ్రహించాడు. ఇక చేసేది లేక శ్రీరాంసాగర్.. నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తీగ లాగితే డొంక అంత కదిలింది. అలివేలు, అనితల ద్వయం ఇదే తరహాలో గుప్త నిధులు, క్షుద్ర పూజలు పేరుతో చాలా మందిని మోసం చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు ఖాకీలు. వారి వద్ద నుంచి 1160 నకిలీ బంగారు నాణేలు, రూ.7.50లక్షల నగదు, తాయత్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఏది ఏమైనా మరోసారి ఈ మూఢ నమ్మకాలు అమాయక ప్రజల చెవిలో పువ్వు పెట్టిన ఘటన ఇది. అత్యాశకు పోయి గుప్త నిధులు, క్షుద్ర పూజలు నమ్మితే ఇదిగో ఇలానే మోసపోతారు.

Also Read

Related posts