ఆమెకు 6 నెలల క్రితమే పెళ్లైంది. జీవితాన్ని ఎంతో ఊహించుకుంది. కానీ అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. భర్త, అత్తమామల వేధింపులతో ఆమె నిత్యం నరకం అనుభవించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అదనపు కట్నం, అనుమాన వేధింపులు ఒక నవ వధువు జీవితాన్ని ఆరు నెలల్లోనే బలి తీసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో పెళ్లైన ఆరు నెలలకే అంజలి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు అత్తమామలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన భర్త వేధింపులే కారణమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లచ్చగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఏకైక కుమార్తె అయిన అంజలికి.. ఆరు నెలల క్రితం అట్లూరి సాయికుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం జరిగింది. కూతురు సుఖంగా ఉంటుందని ఆశించిన తల్లిదండ్రులకు ఆశలు అడియాశలయ్యాయి. అంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో గమనించిన అత్తమామలు హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజలి మృతి చెందింది. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. అంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. ఆమె తల్లిదండ్రులకు అత్తమామలు సమచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. తమ కూతురు మరణానికి సంబంధించిన వివరాలను తమకు ఎందుకు చెప్పాలేదంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
తల్లిదండ్రుల ఆరోపణలు
అదనపు కట్నం తేవాలని అత్తామామలు, భర్త సాయికుమార్ తమ కూతురిని తరచూ వేధించేవారని తల్లిదండ్రులు తెలిపారు. భర్త సాయికుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినప్పటికీ, కట్నం కోసం వేధించారని వాపోయారు. ముఖ్యంగా అత్తమామలు, అల్లుడు అనుమానంతో కూడా అంజలిపై తరచూ గొడవలు పడేవారని వెల్లడించారు. అంజలి మూడు నెలల గర్భిణీ అని తెలిసినా కూడా వేధింపులు ఆపలేదని.. చివరకు ఆమె బలవన్మరణానికి పాల్పడిందని వాపోయారు.
వదిలిపెట్టొద్దు..
తమ కుమార్తె మరణానికి కారకులైన అత్తమామలు, భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వేధింపుల కారణంగానే అంజలి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. లచ్చగూడెం గ్రామంలో ఈ ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Also read
- మార్గశిర అమావాస్య పూజతో మహర్ధశ.. ఈ రాశులు వారు చేసే దానం వారిని ధనవంతులుగా చేస్తుంది…!
- Karthika Masam: కార్తీక మాసంలో ఒక్క దీపం కూడా వెలిగించలేదా?.. ఈ రోజును అస్సలు మిస్ చేసుకోకండి..
- Andhra: ‘అమ్మ.. కన్నయ్య’.. కంటతడి పెట్టిస్తోన్న ఆ చిత్రం.. పాపం ఆమె ఎంత కుమిలిపోయిందో..
- Hyderabad: 45 ఏళ్ల పాత సమాధిలో మరో మృతదేహాన్ని పాతిపెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంట్లోకి వెళ్లిన ఓ యువకుడు.. ఆ తర్వాత, ఏం జరిగిందంటే..





