SGSTV NEWS online
CrimeTelangana

అర్ధరాత్రి ఏటీఎం దోచేద్దామనుకున్నాడు.. అలారమే దొంగకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది!





కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏటీఎం చోరీకి జరిగిన ప్రయత్నం కలకలం రేపింది. జేపీఎన్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి చొరబడి నగదు దోచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఏటీఎంలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ అప్రమత్తమై అలారం మోగించడంతో దొంగ ఖాళీ చేతులతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం (నవంబర్ 10) అర్ధరాత్రి దాటిన తర్వాత 1:06 గంటల సమయంలో ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఓ వ్యక్తి చేతిలో ఇనుపరాడ్‌తో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించాడు. ముందుగా ఏటీఎం తలుపును ఇనుపరాడ్‌తో ధ్వంసం చేసి, అనంతరం నగదు భద్రపరిచే మిషన్ భాగాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం ఈ-సర్వైలెన్స్ వ్యవస్థ అనుమానాస్పద కదలికలను గుర్తించి వెంటనే అలారం మోగించింది. దీంతో భయపడిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే సమయంలో ఏటీఎం కేంద్రం వద్ద ఉన్న సీసీ కెమెరాలను కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పగడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల గాంధారిలో ఏటీఎం దొంగలను అరెస్టు చేసిన ఘటన మరువకముందే జిల్లా కేంద్రంలో మరో ప్రయత్నం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also read

Related posts