SGSTV NEWS online
CrimeTelangana

పరుగెడుతూ బావిలో పడ్డ యువకుడు.. తీవ్ర గాయాలతో రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాటం!


గ్రామాలపై ఆకలి దాడులు చేస్తున్న కోతుల గుంపు మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కోతుల గుంపు ఓ యువకుడిని ప్రమాదంలో పడేశాయి. కోతుల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడ్డ ఆ యువకుడు రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాటం చేసి మృత్యుంజయుడయ్యాడు. బావిలో పడ్డ అతన్ని గమనించిన స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన వర్ధన్నపేట మండలం జరిగింది.. డిసి తండాకు చెందిన విక్రమ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వెళుతున్నాడు. వర్ధన్నపేట శివారులోని ధాన్యం విక్రయ కేంద్రం వద్ద అతనిపై కోతులు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ క్రమంలో కోతుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన విక్ర,మ్ అక్కడి నుండి పరిగెడుతూ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు.

అక్కడున్న వారంతా ఆ కోతలను కర్రలతో తరిమి బావిలో పడ్డ విక్రమ్ ను కాపాడే ప్రయత్నాలు చేశారు. తీవ్రంగా గాయపడ్డ విక్రమ్, దాదాపు రెండు గంటలకు పైగా ఆ బావిలోనే చిక్కుకుని మృత్యువుతో పోరాటం చేశాడు. అతన్ని బయటకు తీసేందుకు స్థానికులతో కలిసి అతని స్నేహితులు ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది బావిలోకి దిగి విక్రమ్ ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో విక్రమ్ కు రెండు చేతులు విరిగాయి. తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని బావి నుండి బయటతీసి మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు కోతుల బెడద నుండి తమ ప్రాణాలను కాపాడండి మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో కోతుల బెడద ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్లన్న తేడా లేకుండా కోతులు మీద పడి రక్కి గాయపరుస్తున్నాయి. కోతుల బారి నుండి తమ ప్రాణాలు కాపాడని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

Also read

Related posts