SGSTV NEWS online
Andhra PradeshCrime

ప్రియుడి మోజులో పడి భర్తను ఏం చేసిందంటే..



.

ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కడతేడ్చిన ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది. భార్య ఆమె ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్టు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప సమీపంలో ఈనెల 16వ తేదీన గుర్తుతెలియని మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న నందివర్గం పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి హత్య చేసి ఇక్కడ పడేసినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో మృతుడు డోన్ పట్టణానికి చెందిన బొరిల్లా విల్సన్ గా గుర్తించారు. మృతుని తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డోన్ పట్టణానికి చెందిన విల్సన్ తో 11 సంవత్సరాల క్రితం సమీప బంధువైన నంద్యాల బొగ్గు లైన్ కు చెందిన మేరీ అలియాస్ రాశితో వివాహం జరిగింది. విల్సన్ గౌండా పనిచేస్తుండగా మేరీ వ్యవసాయ కూలీ పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం డోన్ నుండి నంద్యాల పట్టణానికి మకాం మార్చి అక్కడే జీవనం సాగిస్తున్నారు.

మేరీ పనిచేస్తున్న ప్రాంతంలోనే నంద్యాల కే చెందిన మధుతో పరిచయం ఏర్పడింది.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో మేరీ కి విల్సన్ కు మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవలోనే విల్సన్ భార్య మేరీ పై అనుమానంతో వేధిస్తూ ఉండడంతో భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. అయితే.. 15 రోజుల క్రితం ఇంట్లో భార్య మేరీతో గొడవపడి విల్సన్ డోన్ కు వెళ్ళిపోయాడు. భర్త వేధింపులు భరించలేని మేరీ ఎలాగైనా విల్సన్ ను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అందులో భాగంగా ప్రియుడు మధు అతని స్నేహితులు రఫీ, అశోక్ లతో కలిసి భర్త విల్సన్ హత్య కు పథకం వేశారు.

నంద్యాల నుండి ఆటోలో డోన్ కు బయలుదేరిన నిందితులు ముందుగా వేసిన ప్లాన్ ను అమలు చేశారు. నంద్యాలకు వెళదామని విల్సన్ కు నమ్మబలికి ఆటోలో ఎక్కించుకొని బయలుదేరారు. మార్గమధ్యలో ఫుల్లుగా మద్యం తాగి బనగానపల్లె మీదుగా నంద్యాలకు వస్తుండగా కైప వద్ద వెంచర్లలో ఆటో ఆపి విల్సన్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. మెడకు బెల్టు బిగించి బండరాళ్లతో తలపై మోదీ అంతమొందించి.. ఆపై మృతదేహానికి నిప్పు పెట్టి తగలబెట్టే ప్రయత్నం చేశారు.


ఎవరైనా చూస్తారన్న భయంతో నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు మృతదేహం పడి ఉందన్న సమాచారం పోలీసులకు చేరవేయడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే.. నిందితులు పోలీసులకు భయపడిపోయి కైప వీఆర్ఓ ద్వారా పోలీసులకు లొంగిపోయారు. నిందితులు హత్యకు గల కారణాలను పోలీసుల విచారణలో వెల్లడించారు. భార్య మేరీ ప్రియుడి మోజులో భర్తను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు.

విల్సన్, మేరీ దంపతులకు 10 సంవత్సరాల కుమార్తె, నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధాల మోజులో పడి భార్య భర్తను హత్య చేసి జైలుపాలు కావడంతో వారి పిల్లలు తల్లిదండ్రులు లేక ఆలనా పాలన లేక అనాథలుగా మారారు.

Also read

Related posts