SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra Pradesh: ఎంత పని చేశార్రా పిల్లలూ.. ఇంట్లో అమ్మానాన్నలు లేని సమయంలో..!



దీపావళి అంటే సరదా..! రకరకాల బాణాసంచా కాల్చవచ్చని ఈ పండగ కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. దీపావళి ముందు నుంచి ప్రతి ఇంట్లోనూ ఈ హడావుడి కనిపిస్తుంది. పండగరోజు తరువాత రెండు రోజులు వరకు ఉండే సందడి.. ఆ ఏడాదంతా పిల్లలకు గుర్తు ఉండి పోతుంది. అయితే చాలా మంది మిగిలిన టపాసులను ఇంట్లోనే దాచుకుంటారు. నాగులచవితి రోజు కాల్చుకోవచ్చంటూ పిల్లలను సముదాయిస్తారు. ఇంకా మిగిలిన టపాసులు ఇంట్లోనే ఉంచితే ఏమవుతుందో, ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

దీపావళికి మిగిలిపోయిన టపాసులను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరగక మానవు ఇటువంటి సంఘటనే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు నాగదేవత కాలనీలో సంభవించింది. దీపావళికి కాల్చగా మిగిలిన టపాసులను ఒక చోట ఉంచగా వాటిని ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో పేల్చేందుకు యత్నించారు. వంటింట్లోని స్టవ్‌పై టపాసులు ఉంచి కాల్చగా ఒక్కసారిగా పేలడంతో బాబి(7),ఆశబు(11) అనే ఇద్దరు అన్నదమ్ముళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి కుడి చెయ్యి మణికట్టు వరకు వేళ్ళు తెగిపోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడ్డ చిన్నారులు ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలు అయిన బాబీని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పిల్లలకు ఏమి తెలుసు అమాయకత్వం నిండిన చూపులు, చేష్టలు మినహా..! ఏ ఘటన ఎంత తీవ్రమైనదో తెలుసుకునేలోగానే.. చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఇకపై టపాసులు ఇంట్లోనే ఉంచటం కంటే వాటికి దూరంగా పిల్లలకు అందకుండా దాచటంపై పెద్దలు దృష్టి పెట్టాలి..!

Also Read

Related posts