SGSTV NEWS online
Andhra PradeshCrime

స్నేహితుల మధ్య వివాదం.. విద్యుత్ స్తంభానికి రౌడీషీటర్‌ను కట్టేసిన బంధువులు!



తెనాలిలో స్నేహితుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రబ్బానీతో స్నేహం చేస్తున్నాడనే కారణంతో హరీష్‌పై అరాఫత్ దాడి చేయగా, ఆగ్రహించిన హరీష్ బంధువులు అరాఫత్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టినట్లు సమాచారం. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


స్నేహితుల మధ్య మొదలైన వివాదం చివరకు దాడులు, పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లింది. తనకు నచ్చని వ్యక్తితో స్నేహం చేస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేయగా.. ఆగ్రహించిన బాధితుడి బంధువులు దాడికి పాల్పడిన వ్యక్తిని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన తెనాలిలోని నందుల పేటలో చోటుచేసుకుంది. నందుల పేటకు చెందిన లీలా హరీష్, అరాఫత్ గతంలో స్నేహితులుగా ఉండేవారు. కొంతకాలం ఇద్దరూ కలిసి తిరిగారు. వెండి ఆభరణాల దుకాణంలో పనిచేసే అరాఫత్‌పై తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో హరీష్.. అరాఫత్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో హరీష్ రబ్బానీతో స్నేహం చేయడంతో వివాదం మొదలైంది. రబ్బానీకి, అరాఫత్‌కు గతంలోనే గొడవలు ఉండటంతో అతడితో హరీష్ సన్నిహితంగా ఉండటాన్ని అరాఫత్ జీర్ణించుకోలేకపోయాడు. తనకు నచ్చని వ్యక్తితో ఎందుకు తిరుగుతున్నావంటూ హరీష్‌తో తరచూ గొడవపడేవాడు.


రెండు రోజుల క్రితం అరాఫత్ నందుల పేటలోని హరీష్ ఇంటికి వెళ్లాడు. రబ్బానీతో స్నేహం చేస్తున్న విషయంపై ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అరాఫత్.. హరీష్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో హరీష్ బంధువులు ఆగ్రహంతో అరాఫత్‌ను అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టినట్లు సమాచారం. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఏఎస్ఐ ఘర్షణను గమనించి ఇరు వర్గాలను నిలువరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని హరీష్ బంధువులకు సూచించి, అరాఫత్‌ను విడిపించారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హరీష్ బంధువులు అరాఫత్‌పై ఫిర్యాదు చేయగా.. అరాఫత్ బంధువులు హరీష్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts