SGSTV NEWS online
Andhra PradeshCrimeNational

ఓబులాపురం మైనింగ్ గనుల కేసులో కీలక పరిణామం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని గనులను కొల్లగొట్టిన ఘనుల అక్రమాలు తేల్చేందుకు మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో ఓబులాపురం మైనింగ్ గనుల్లో సర్వే మొదలు పెట్టారు అధికారులు. అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓబులాపురంలోని గనుల సరిహద్దులను నిర్ధారించేందుకు సర్వే మొదలు పెట్టారు.

కర్నాటక సరిహద్దును ఆనుకుని ఉన్న అనంతపురం జిల్లా పరిధిలోని ఆరు మైనింగ్ గనుల లీజులకు సంబంధించి 2010లో సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూమిలో కాకుండా అటవీ శాఖకు చెందిన భూములలో కూడా మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మూడు నెలల్లో ఆరు మైనింగ్ గనుల సరిహద్దులను గుర్తించేదుకు సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సర్వే పనులను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుధాన్షు ధులియా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు నియమించిన ఈ బృందం ఇప్పటికే అనంతపురం జిల్లా పరిధిలోని ఆరు మైనింగ్ గనులను పరిశీలించింది. అటవీ శాఖ, భూగర్భ గనులు శాఖ, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సంయుక్తంగా ఈ గనుల సరిహద్దులను నిర్ణయించేందుకు సర్వే ప్రారంభించారు.

నాలుగైదు రోజులపాటు డ్రోన్ల ద్వారా సర్వే చేయనున్నారు. ఆ తర్వాత లీజుల హద్దులను కొలిక్కి తెస్తారు. అనంతరం అధికారులు సిద్ధం చేసిన వివరాలను సమీక్షించి, తర్వాత సుప్రీంకోర్టుకు నివేదికను అందజేయనున్నారు. ఓఎంసీ వాటి లీజులు హద్దులు, రాష్ట్ర సరిహద్దులు దాటేసి ఎంతమేర అక్రమ తవ్వకాలను జరిపింది? ఎంత ఖనిజాన్ని తరలించిందనే అంశాలను సుప్రీంకోర్టు తేల్చనుంది.

Also read

Related posts