ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీకి వలస వెళ్ళిన ఆ యువతి ఉసురు పోయింది. సిక్కోలు జిల్లాకి చెందిన యువతి బెహ్రాన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతికి రెండురోజుల ముందే తనను తీవ్ర ఇబ్బందులు పెడుతూ వేధిస్తున్నారని.. స్వస్థలానికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ లో చెప్పింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని కబురు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్ళవలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి నాలుగేళ్ల క్రితం జీవనోపాధి కోసమని బెహ్రాన్ వెళ్ళింది. ఏజెంట్ ద్వారా బెహ్రాన్ చేరుకున్న ఆమె అక్కడ ఒక వస్త్రదుకాణంలో పనిచేస్తూ కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించేది. ఏడాది కిందట ఇంటికి వచ్చిన ఆమె కొద్దిరోజులు ఇక్కడ ఉండి మళ్ళీ ఐదు నెలల కిందట బెహ్రాన్ కి ఉపాధి కోసం వలస వెళ్ళింది. గతంలో వెళ్లినప్పుడు అంతా బాగానే ఉన్నా.. రెండవసారి మళ్ళీ బెహ్రాన్ వెళ్ళినప్పుడు మాత్రం ఆమె ఇరకాటంలో పడింది. వంటమనిషిగా ఉపాధి అని చెప్పి ఇంటి పని, వంట పని చేయించటంతో పాటు, గొర్రెలు, ఒంటెలకు మేత పెట్టటం వంటి పనులు చేయిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతుండేవారంటూ నాగమణి తల్లి సరోజినీకి చెప్పింది. పది మంది చేయాల్సిన పని ఒక్క వ్యక్తితో చేయిస్తూ వేధిస్తూ ఉండేవారని పలుమార్లు చెప్పిందని.. ఆ ఇంటి వృద్ధుడు దారుణంగా వేధించేవాడని నాగమణి కన్నీరు పెట్టుకుందని సరోజని చెప్పింది.
తనతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఇవన్నీ విషయాలు చెప్పడంతోపాటు.. త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పిందని నాగమణి తల్లి కన్నీరుమున్నీరయ్యింది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఫోన్ చేసిన నాగమణి అక్కడ తనకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని, వేధిస్తున్నారని చెప్పినట్లు తల్లి సరోజిని తెలిపారు. తనను స్వస్థలానికి తీసుకువెళ్లాలని అక్కడ పరిస్తితి వివరించి మంత్రి నారా లోకేష్, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ లకు ఫోన్ చేసి వేడుకోవాలనుకుంటున్నాని చెప్పిందని సరోజని తెలిపారు. అయితే తాము కూడా వచ్చేయమని చెప్పామని, అయితే ఇంతలోనే ఏం జరిగిందో కానీ, శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్న నాగమణి కుటుంబ సభ్యులకు.. నాగమణి గత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందింది.. ఆమెను బెహ్రాన్ పంపిన ఏజెంట్‌కు అక్కడి నుంచి సమాచారం రావడంతో అతను నాగమణి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసాడు. తిరిగి వచ్చేస్తానని చెప్పిన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి ఉండదని, అక్కడ ఎవరో ఆమెను హత్య చేసారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లి సరోజని. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఫొటోలు, వీడియోలు చూపించాలని ప్రాథేయపడినప్పటికీ.. ఏజెంట్ అందుకు అంగీకరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచని నాగమణి కుటుంబ సభ్యులు గత ఐదు రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాగమణి మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడంలో చొరవ చూపాలని మృతురాలి తల్లి సరోజని కోరుతున్నారు. అసలే తమ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం అని ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Also Read
- ఉపాధి కోసం దేశం దాటి వెళ్లింది.. వేధింపుల గురించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంది.. ఇంతలోనే..
- Andhra: ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా..
- ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు.. అద్దె భవనంలో గుట్టుచప్పుడు యవ్వారం.. కట్‌చేస్తే..
- మాజాలో విషం కలిపి కూతురు, కొడుకుకు ఇచ్చాడు..
- ఇంట్లో కదల్లేని స్థితిలో కనిపించిన కూతురు.. ఏమైందోనని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..





