ఇంటి అద్దె.. పిల్లల చదువులు.. రోజువారీ ఖర్చులు.. ఇలా జీవితంతో పోరాడుతూ కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఓ సాధారణ సెక్యూరిటీ గార్డు, కొన్ని వేల రూపాయల కోసం తీసుకున్న లోన్.. చివరికి అతను ప్రాణాన్నే తీసుకుంది. కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయవిదారకర ఘటన అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆప్పుల వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాసానిగూడెంకు చెందిన వీడే గిరీష్ కుమార్ అనే యువకుడు లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడు ఒక ప్రైవేట్ కంపెనీలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేట్ లోన్ ఆప్ ద్వారా కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు.
అయితే అప్పు తీసుకున్న తర్వాత నుంచి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. వడ్డీలకు వడ్డీల రూపంలో డబ్బులు వసూలు చేశారు. అంతేకాదు అప్పు తిరిగి కట్టాలంటూ అసభ్యకరమైన కాల్స్, వాట్సాప్ మెసేజ్ లతో తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెల్లించాల్సిన అసలు మొత్తానికి మించి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బంధువులకు ఫోన్ చేసి పరువు నష్టం కలిగించారని వాపోతున్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక గిరీష్ తీవ్ర మనస్థాపానికి గురై చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోన్ యాప్ ద్వారా అప్పుల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లోన్ యాప్ వేధింపులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల్లో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తుంది. అవసరాల కోసం తీసుకున్న చిన్న అప్పు కుటుంబాన్ని శాశ్వతంగా చీకటిలోకి నెట్టేసిస్తున్నాయి. తాజాగా ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని మిగుల్చింది.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





