SGSTV NEWS online
Andhra PradeshCrime

పేరుకే ఆసుపత్రి.. నర్స్‌తో అబార్షన్ చేయించగా.. ఐదునెలల గర్భిణికి ఏమైంది?

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ అందుబాటులో లేని ప్రైవేట్ వైద్యశాలలో నర్స్, కాంపౌండర్ ఫోన్‌లో ఇచ్చిన సూచనలతో ఐదునెలల గర్భిణికి అబార్షన్ చేయగా.. తీవ్ర అనారోగ్యానికి గురై ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అక్రమ స్కానింగ్, భ్రూణ లింగ నిర్ధారణపై కూడా స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



పేరుకే ఆసుపత్రి… అందుబాటులో డాక్టర్లు ఉండరు… నర్సులు, కాంపౌండర్‌లే వైద్యులు. ఫలితం.. సరైన వైద్యం అందక ఐదునెలల గర్భిణి మృతి చెందిన దారుణ ఘటన ప్రకాశంజిల్లాలో చోటు చేసుకుంది. విషయం ఏంటంటే.. అబార్షన్‌ చేయించుకునేందుకు బంధువులతో కలిసి వచ్చిన మహిళకు నర్స్‌ అబార్షన్‌ చేసింది. ఆమెకు అనుభవం ఉందా, అంటే అదీ లేదట. కాంపౌండర్‌ ఫోన్‌లో సూచనలు చేస్తుంటే వైద్యం చేసింది. ఆ నర్స్‌ అరకొర వైద్యంతో సరైన వైద్యం అందక గర్భిణి మృతి చెందింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.


మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని ఓ ప్రయివేటు వైద్యశాలలో నర్స్ చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మురారిపల్లి చెందిన 31 ఏళ్ళ షేక్ మాబున్ని అనే వివాహిత మహిళ అబార్షన్ చేయించుకునేందుకు వైద్యశాలకు వచ్చింది. అక్కడ డాక్టర్ లేకుండానే నర్స్, కాంపౌండర్‌ శ్యామ్ ఫోన్‌లో చెప్పిన విధంగా ఐదు నెలల గర్భిణీ మహిళకు అబార్షన్ చేసి పిండాన్ని బయటకు తీసింది. ఆ తరువాత మహిళ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళ శవంతో జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. డాక్టర్ లేకుండా ప్రవేటు వైద్యశాలను నడిపిస్తున్న బాధ్యులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మూడోసారి ఆడపిల్లే అన్న అనుమానంతోనేనా…?

యర్రగొండపాలెంలో ఇద్దరు ముగ్గురు ఆర్‌ఎంపీలు గోప్యంగా స్కానింగ్‌లు చేస్తూ.. గర్బిణి స్త్రీలకు ఆడ, మగ అని చెబుతూ వారి అవసరాన్ని బట్టి అబార్షన్‌లు చేస్తుండటం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా తోడయిందన్న అరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మృతి చెందిన మహిళకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు కాగా మూడవ సంతానం కూడా ఆడ పిల్ల అనే అనుమానం కారణంగా అబార్షన్‌కు వచ్చినట్టు సమాచారం. మూడోసారి ఐదు నెలల గర్భిణిగా ఉన్న మహిళకు ఓ ప్రయివేటు ప్రాక్టీషనర్‌ స్కానింగ్‌ చేయించి ఆడపిల్ల అని చెప్పినట్టు అనుమానాలున్నాయి. ఈ కారణంగానే మూడోసారి కూడా ఆడపిల్ల వద్దనుకున్న బంధువులు ఆమెకు అబార్షన్‌ చేయించేందుకు ప్రయివేటు వైద్యశాలకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రయివేటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం బలికావడంపై, స్థానికంగా ఉన్న కొంతమంది ఆర్‌ఎంపీ గర్బస్థ శిశువుల స్కానింగ్‌ అక్రమ వ్యాపారంపై పూర్తిస్తాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also read

Related posts