ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా అంటే ప్రశాంతమైన జిల్లాగా గుర్తింపు.. అయితే అటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల గన్ కల్చర్ పెరుగుతోంది. కొన్ని గ్యాంగ్‌లు ఎటువంటి అనుమతులు లేకుండా పిస్టల్స్ పట్టుకు తిరగటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ వద్ద తుపాకీ కలకలం సృష్టించింది. బైక్ పార్కింగ్ టెండర్ల వివాదంలో.. నిందితులు తుపాకీ, కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే రెండు రోజుల వ్యవధిలోనే నేరానికి పాల్పడ్డ నలుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మున్నా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిoదితుల నుంచి కంట్రీ మేడ్ తుపాకీ, 4 రౌండ్లు, 3కత్తులు, 2 కర్రలు, స్కూటీ, 3 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితులు ఒకే కుటుంబానికి చెందిన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురంకి చెందిన మీసాల సురేష్(A-1),2 మీసాల చిన్నారావు(A-2),మీసాల మోహనరావు(A-3)లు గా గుర్తించారు. మరో నిందితుడైన రెమున్నా @ సుదీప్(A-4) కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పలాస రైల్వే స్టేషన్‌లో గత 13ఏళ్లుగా రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటనెన్స్, టూ వీలర్ పార్కింగ్ లను A -1గా ఉన్న మీసాల సురేష్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే, కిందటేడాది డిసెంబర్లో రెండు టెండర్లు వేరే వ్యక్తులకు దక్కాయి. పార్కింగ్ టెండరును రూ.55లక్షలకు జగన్నాథం అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ఈ సందర్భంలో శుక్రవారం అర్ధరాత్రి 12గంటలతో సురేష్ టెండర్ గడువు ముగుస్తుంది. దీంతో పార్కింగ్ నిర్వహణను స్వాధీన పరుచుకొనేందుకు జగన్నాథం అతనితో పాటు మధు అనే మరో వ్యక్తితో అర్ధరాత్రి 12గంటలకు రాగా.. అ సందర్భంలోనే సబ్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నించిన సురేష్ మిగిలిన నిందితులతో కలిసి అక్కడకు చేరుకొని వారిపై దాడికి యత్నించాడు. ఆ సందర్భంలో నిందితుల్లో ఒకరైన చిన్నారావు తన వద్ద ఉన్న తుపాకీని తీయగా.. జగన్నాథం అక్కడ నుంచి పారిపోయాడు. అప్పుడు మోహనరావు అనే నిందితుడు కత్తులతో మదుపై దాడి చేసాడు.
జగన్నాథం తనపై జరిగిన హత్యాయత్నం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులపై గతంలో హత్య, హత్యాయత్నం, రాబరీ కింద సురేష్ పై 4కేసులు, చిన్నారావు,మోహనరావులపై 8 కేసులు నమోదు అయినట్లు కాశీబుగ్గ DSP షేక్ షాహా బాజ్ అహ్మద్ తెలిపారు.
నిందితులకు తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? ఎందుకోసం వాళ్ళు తుపాకీ కొనుగోలు చేశారు.. గతంలో ఇంకా ఏ ఏ నేరాలకు దానిని ఉపయోగించారు.. అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నెల రోజుల వ్యవధిలో ఇలా అనధికారికంగా పోస్టల్ లతో హల్చల్ చేస్తున్న ముఠాని పట్టుకోవడం జిల్లాలో ఇది రెండవసారి. కిందటేడాది డిసెంబర్లో శ్రీకాకుళం నగర శివారులో ఓ ఇంట్లో అనధికారికంగా తుపాకీ పట్టుకొని ఉన్న ఓ ముఠాను శ్రీకాకుళం రూరల్ పోలీసులు పట్టుకొన్నారు. ఇపుడు మరో తుపాకీ నీ కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





