చుట్టూ కొండలు.. మధ్యలో జనం కంటపడని ఒక రహస్య ప్రాంతం.. అక్కడ ఉన్న ఒక కంటైనర్ తాళం తీసిన పోలీసులకు షాక్ అయ్యే దృశ్యం కనిపించింది. వేల సంఖ్యలో డిటోనేటర్లు, వందల కొద్దీ జిలెటిన్ స్టిక్స్ వంంటి భారీ పేలుడు పదార్థాల డంప్‌ను మడకశిర పోలీసులు బట్టబయలు చేశారు. అసలు ఒక సామాన్య రైతు పొలంలోకి ఇన్ని పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి?
గుట్టు చప్పుడు కాకుండా గుట్టల మధ్యలో భారీగా పేలుడు పదార్థాలు డంప్‌ను సత్యసాయి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. భారీ పేలుడు పదార్థాల డంప్ బయటపడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. మడకశిర శివారులోని శివాపురం గ్రామంలో జరిగిన ఈ తనిఖీల్లో భారీ ఎత్తున జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. శివాపురం గ్రామానికి చెందిన బాలాజీ అనే రైతు తన పొలంలో ఒక భారీ కంటైనర్‌ను ఉంచాడు. చుట్టూ కొండలు, గుట్టలు ఉండటంతో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాలేదు. అయితే అక్కడ అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయన్న పక్కా సమాచారంతో మడకశిర పోలీసులు మెరుపు దాడి చేశారు. కంటైనర్ తాళాలు పగలగొట్టి లోపలి దృశ్యాన్ని చూసిన పోలీసులే ఒక్కసారిగా నివ్వెరపోయారు. కంటైనర్‌లో శక్తివంతమైన 450 జిలెటిన్ స్టిక్స్, 22,000 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 15 బాక్సుల ఫీజు వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఈ స్థాయిలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్ర – కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో జరిగే అక్రమ క్వారీలు, ఇల్లీగల్ మైనింగ్ వ్యాపారులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంత పెద్ద మొత్తంలో సరుకు ఎక్కడి నుండి వచ్చింది? ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరారీలో రైతు.. పోలీసుల గాలింపు
ప్రస్తుతం ఈ పొలం యజమాని బాలాజీ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ పేలుడు పదార్థాలు కేవలం మైనింగ్ కోసమేనా లేక ఇతర విద్రోహ చర్యల కోసం తెచ్చారా? అన్న అనుమానాలను కూడా పోలీసులు నివృత్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మడకశిర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
also read
- బైక్‌పై వెళ్తున్న తల్లి కొడుకు ప్రాణాలు తీసిన మురుగు కాలువ.. ఏం జరిగిందంటే?
- ఓ మహిళ, మరో నలుగురు వ్యక్తులు.. నిర్మానుష్య ప్రదేశంలో తచ్చాడుతూ కనిపించారు.. కట్ చేస్తే..
- వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలు.. మీ పూర్వీకుల ఆశీస్సులు లభించి సక్సెస్ మీ సొంతం!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





