SGSTV NEWS online
Andhra PradeshCrime

ఫోర్జరీ పత్రాలతో విలువైన భూమిపై కన్ను.. లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్..



అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నకిలీ పత్రాలతో భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై రౌడీషీటర్ కోనేటి సులోచన సహా ముగ్గురిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఫోర్జరీ పత్రాలు, నకిలీ రికార్డులతో విలువైన స్థలాలను ఆక్రమిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న మదనపల్లెకు చెందిన లేడీ డాన్, రౌడీషీటర్ కోనేటి సులోచనతో పాటు ఆమె ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ భూ ఆక్రమణ వ్యవహారంలో పీటీ (PT) వారెంట్‌పై సులోచన సహా ముగ్గురిని స్వాధీనంలోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మదనపల్లె టూటౌన్ ఎస్ఐ నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఎస్ఐ నాగేశ్వర్‌రావు పలు కీలక వివరాలను వెల్లడించారు.


కేసు వివరాలు:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన మార్పూరి శ్రీరామ్‌కు చెందిన భూమిని, అతని పెద్దనాన్న కుమారుడు మార్పూరి వెంకటేష్ 2023లోనే రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సదరు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే వివిధ కేసుల్లో మదనపల్లె సబ్‌జైలులో ఉన్న నిందితులపై పీటీ వారెంట్ జారీ చేశారు. కోనేటి సులోచన, ఆమె అనుచరుడైన గుండిగల మోహన్, రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రియల్టర్ కడియాల శ్రీరాములు నాయుడులను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. ఈ భూ ఆక్రమణ కేసులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్ఐ తెలిపారు.


కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులైన కోనేటి సులోచన, కడియాల శ్రీరాములునాయుడులపై ఇప్పటికే పలు క్రిమినల్, భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి.. అంతకుముందు కూడా సులోచన జైలుకెళ్లినట్లు పేర్కొంటున్నారు.

Also read

Related posts