SGSTV NEWS online
Andhra PradeshCrime

పోలీస్ స్టేషన్‌లో హైటెన్షన్.. అందరు చూస్తుండగానే.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న న్యాయవాదులు!



కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేసు విషయంలో ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.


బుధవారం ఓ కేసు విషయంలో న్యాయవాది వైఆర్ మల్లికార్జునపై ఆయన క్లైంట్ దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మల్లికార్జున టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని న్యాయవాదులు ఆరోపించారు. దీంతో సాయంత్రం పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు.



ఇదే సమయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఎస్పీని కలిసేందుకు ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే ఏఎస్పీ అక్కడి నుంచి వెళ్లిన అనంతరం పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పినట్లు తెలుస్తోంది. పోలీసుల సమక్షంలోనే స్టేషన్ బయట, లోపల ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.


ఈ ఘర్షణలో హైకోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు పురుషోత్తం రెడ్డిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.

కేసు నమోదు విషయంలో తలెత్తిన వివాదం చివరకు న్యాయవాదుల పరస్పర దాడులకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఘర్షణకు కారణాలు, ఇరువర్గాలపై ఏ మేరకు కేసులు నమోదు చేస్తారన్నది పోలీసుల విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Also read

Related posts