ఒక పక్క క్రికెట్ మైదానంలో పరుగులు తీస్తూ, మరో పక్క సోషల్ మీడియాలో యువతుల జీవితాలను తలకిందులు చేశాడు. క్రీడాకారుడి హోదా, ఆకర్షణీయమైన రూపం.. ఈ రెండింటినీ పెట్టుబడిగా పెట్టి అమాయక మహిళల విశ్వాసాన్ని దోచుకున్నాడు. ప్రేమ పేరుతో దగ్గరై, న్యూడ్ వీడియో కాల్స్ రికార్డు చేసి, ఆపై డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ఈ యువకుడి కొత్త దందా.
గుణం కంటే అందాన్ని, ఆకర్షణను నమ్ముకుని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్ల పట్ల యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తాజాగా తన అందాన్ని, క్రీడాకారుడి హోదాను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో యువతులను ట్రాప్ చేసి, న్యూడ్ కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒక యువకుడిని అరెస్టు చేశారు. ఏలూరులోని గ్జేవియర్ నగర్‌కు చెందిన నిందితుడు వెంపాటి జస్విన్ ఈ నేరాలకు పాల్పడ్డాడు. స్మార్ట్‌గా, ఆకర్షణీయంగా ఉండే జస్విన్, తనకున్న ఈ లక్షణాలను మహిళలను ట్రాప్ చేయడానికి వాడుకున్నాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమ్మాయిలతో ఛాటింగ్ చేసి, మంచిగా మాట్లాడుతూ, అమాయకత్వం నటిస్తూ వారిని పూర్తిగా నమ్మించేవాడు. తర్వాత ప్రేమ, పెళ్లి మాటలతో నమ్మిస్తూ వారితో ఏకాంతంగా వీడియో కాల్స్ మాట్లాడేలా ప్రేరేపించేవాడు. చాట్ చేస్తున్న సమయంలోనే వారి న్యూడ్ వీడియో కాల్స్‌ను రహస్యంగా స్క్రీన్ రికార్డు చేసేవాడు. ఈ రికార్డు చేసిన అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకుని బాధితులను బ్లాక్ మెయిల్ చేసి, భారీగా డబ్బులు డిమాండ్ చేసేవాడు.
జస్విన్ చేతిలో మోసపోయిన బాధితులలో బాలింత మహిళలు కూడా ఉండడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఈ తరహా వేధింపులకు గురైన ఓ బాధితురాలు ధైర్యం చేసి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం వెంపాటి జస్విన్‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. “నిందితుడు జస్విన్, క్రికెట్ ప్లేయర్. సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకుని, వారితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించాం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసే మహిళలు, యువతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆన్‌లైన్ సంభాషణల్లో హద్దులు మీరితే జీవితమే తలకిందులు అయ్యే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించారు. అపరిచితులు లేదా పరిచయం ఉన్న వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత విషయాలు పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు
Also read
- నేటి జాతకములు.14 నవంబర్, 2025
- సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
- కె జి హచ్ వైద్యం అందక గిరిజన పసికందు మృతి
- ఏడో తరగతి బాలుడిపై లైంగికదాడి
- భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త





