SGSTV NEWS online
Andhra PradeshCrime

బస్టాండ్‌లో ఒంటరిగా తచ్చాడుతున్న మహిళ.. మ్యాట్రిక్స్ కెమెరాలతో చెక్ చేయగా.. పెద్ద ముదురే..



ఏలూరు జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణలో ముందంజలో ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీటీవీ, మ్యాట్రిక్స్ కెమెరాలను పర్యవేక్షించి, జంగారెడ్డిగూడెంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాత మహిళా నేరస్తురాలు దిగుమర్తి భవానిని పట్టుకున్నారు. AI ఆధారిత ఈ వ్యవస్థ ప్రజల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని మరోసారి నిరూపితమైంది.


ఏలూరు: పోలీస్ యంత్రాంగం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేస్తూ వస్తోంది. హత్యల నుంచి చోరీల వరకు అన్ని నేరాలను కూడా సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు.. అలాగే.. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఏలూరు పోలీస్ యంత్రాంగం నేరాల నియంత్రణలో మరోసారి తమ ప్రతిభను చాటుకుంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో అమలు చేస్తున్న అడ్వాన్స్‌డ్ సర్వైలెన్స్ వ్యవస్థ ఫలితంగా, పాత మహిళా నేరస్తురాలిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సిబ్బంది 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సిస్టమ్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన కమాండ్ కంట్రోల్ సిబ్బంది, మ్యాట్రిక్స్ కెమెరా డేటాబేస్‌లో గత నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.


బస్టాండ్ వద్ద కనిపించిన మహిళ లక్షణాలు, పాత నేరస్తుల డేటాతో సరిపోలడంతో ఆమెపై అనుమానం బలపడింది. వెంటనే ఈ సమాచారాన్ని జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ వీర ప్రసాద్ కు అందించగా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో ఆమె పేరు దిగుమర్తి భవాని అని, తండ్రి పేరు పెంటయ్య, స్వస్థలం రాజమండ్రి అని వెల్లడైంది. గతంలో విశాఖపట్నం జీఆర్‌పీ రైల్వే పోలీస్ పరిధిలో పలు నేరాల్లో పాల్గొన్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం, హనుమాన్ జంక్షన్ పరిధిలో జరిగిన కొన్ని ఆస్తి నేరాల్లో కూడా తన ప్రమేయం ఉన్నట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితురాలిని లోతుగా విచారిస్తున్నామని, ఆమె ద్వారా మరిన్ని నేరాలకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

ఈ ఘటనతో సీసీటీవీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్ వినియోగం నేరస్తులపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మరోసారి స్పష్టమైంది. ప్రజల భద్రతే లక్ష్యంగా టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తూ ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజలో నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.

Also read

Related posts