SGSTV NEWS online
Andhra PradeshCrime

Bapatla: ఓ పెద్దాయన పైసలు కింద పడ్డాయ్.. నీవేనా అడిగారు.. ఆపై క్షణాల్లో..



బ్యాంకుల దగ్గర డబ్బులు డ్రా చేసుకునేందుకు, జమ చేసేందుకు వచ్చే… వృద్ధులు, మహిళలే టార్గెట్‌గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాకచక్యంగా ప్లాన్ వేసి వంద రూపాయల నోట్లు కిందపడేసి.. ఇవి మీవేనా..? అంటూ మాయమాటలతో లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగింది.


బ్యాంకుల దగ్గర డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన వృద్దులు, మహిళలే టార్గెట్‌గా ప్లాన్ వేసి డబ్బులు దోచుకెళుతున్న ముఠాలు ఎక్కువవుతున్నాయి. లక్షల రూపాయల డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని బయటకు వచ్చే వారిని ఏమార్చి చోరీలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు… వంద, ఐదు వందల నోట్లు కిందపడేసి ఇవి మీ డబ్బేనా, అంటూ మాయమాటలు చెప్పి లక్షలు కొట్టేస్తున్నారు… సరిగ్గా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లా ఇంకొల్లులో చోటు చేసుకుంది. కేటుగాళ్ల మాటలకు బలైన ఓ పెద్దాయన 3.90 లక్షల డబ్బులు పొగొట్టుకుని లబోదిబోమంటున్నాడు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.


బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన 75 ఏళ్ల వృద్దుడు చిలంకూరి కాంతయ్య ఇంకొల్లులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాను తాకట్టు పెట్టుకున్న బంగారు నగలను విడిపించుకోవాలని వచ్చాడు. అందుకు బ్యాంకులో కట్టాల్సిన 3 లక్షల 90 వేల రూపాయలు తీసుకుని బ్యాంకులోకి వెళ్లాడు… బ్యాంకు అధికారులు మరో 10 వేల రూపాయలు వడ్డీ అయిందని, మొత్తం 4 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు. దీంతో మరో 10 వేల రూపాయలు ఇంటికి వెళ్లి తీసుకురావడానికి తన సైకిల్‌పై బయలుదేరేందుకు సిద్దమయ్యాడు. తన వెంట తీసుకొచ్చిన 3 లక్షల 90 వేల రూపాయల డబ్బులను సైకిల్ వెనుక ఉన్న క్యారేజ్‌పై పెట్టుకుని బయలుదేరాడు. తన ఇంటి ముందుకు వెళ్లేసరికి.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్‌పై వెనుక నుంచి వచ్చి అతనిని ఏమార్చి 2 వంద రూపాయల నోట్లు అతని ముందు పడవేశారు. పెద్దాయన ఈ డబ్బు మీదేనా అంటూ మభ్యపెట్టారు… కిందపడ్డ వంద రూపాయల నోట్లను చూసిన కాంతయ్య వాటిని తీసుకునే పనిలో ఉండగా సైకిల్‌ వెనుక క్యారేజ్‌పై పెట్టిన 3 లక్షల 90 వేల రూపాయలు ఉన్న ఎర్ర కవర్‌ను తీసుకుని పరారయ్యారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కాంతయ్య లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు… కాంతయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Also Read

Related posts